Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల భాగస్వామ్యం కీలకం-విద్యాభివృద్ధిపై అవగాహన సదస్సులో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

 

 

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్

ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో ప్రజాప్రతినిధులు చురుకుగా వ్యవహరించాలని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పేర్కొన్నారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామ సర్పంచులు, నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం నాగర్‌కర్నూల్ పట్టణంలోని డీకేఆర్ ఫంక్షన్ హాల్‌లో విద్యాభివృద్ధిపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి హాజరయ్యారు. సరస్వతీదేవి చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.

ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతోనే అభివృద్ధి

జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, డిజిటల్ విద్య, నాణ్యమైన బోధన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

గ్రామ స్థాయిలో ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల నాయకులు చొరవ చూపినప్పుడే ప్రభుత్వ పాఠశాలలు మరింత అభివృద్ధి చెందుతాయని అభిప్రాయపడ్డారు. ప్రతి సర్పంచ్, వార్డు సభ్యుడు తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను తరచూ సందర్శించి విద్యార్థుల హాజరు, ఉపాధ్యాయుల బోధన, పరిశుభ్రత, తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అంశాలను పర్యవేక్షించాలని సూచించారు.

బాలికల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, పాఠశాల మానేసే విద్యార్థుల సంఖ్య తగ్గించేందుకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించేందుకు ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు సర్పంచులు చొరవ తీసుకుని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను తల్లిదండ్రులకు వివరించాలని కలెక్టర్ సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు పెరగాలి

ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాల పెంపుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించాలని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.

ప్రైవేట్ పాఠశాలల ఆకర్షణలో పడి తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసుకుంటున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

విద్యాశాఖ చేపడుతున్న కార్యక్రమాలు

జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, రెండు జతల యూనిఫామ్‌లు, విద్యార్థుల అభ్యున్నతికి చేపడుతున్న చర్యలు, పదో తరగతి ఫలితాలపై వివరించారు.

విద్యార్థుల నమోదు పెంపు, మధ్యాహ్న భోజన పథకం, డిజిటల్ తరగతులు, పాఠశాలల ఆధునీకరణ వంటి అంశాలపై చర్చించారు.

ఈ సదస్సులో పాల్గొన్న సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు తమ గ్రామాలు, వార్డుల పరిధిలోని పాఠశాలల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్, నాగర్‌కర్నూల్ మండల విద్యాధికారి కురుమయ్య, సెక్టోరియల్ అధికారులు కిరణ్ కుమార్, వెంకటేశ్వర్ల శెట్టి, వివిధ మండలాల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.