Take a fresh look at your lifestyle.

సింగోటం–గోపాలదిన్నె లింక్ కెనాల్ పనులు వేగవంతం చేయాలి బొల్లారంలో భూబాధిత రైతులతో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖాముఖి

 

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్

కొల్లాపూర్: సింగోటం–గోపాలదిన్నె లింక్ కెనాల్ పనులను త్వరితగతిన పూర్తి చేసి చివరి ఆయకట్టు భూములకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు ప్రస్తుత మార్కెట్ విలువ కంటే మూడింతల పరిహారం అందేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామంలోని రైతు వేదికలో సంగినేనిపల్లి, తూముకుంట, బొల్లారం గ్రామాలకు చెందిన భూబాధిత రైతులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి అభ్యంతరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఎకరాకు రూ.11.50 లక్షల పరిహారం

ప్రస్తుతం ప్రభుత్వ మార్కెట్ విలువ రూ.1,87,500 చాలా తక్కువగా ఉందని రైతులు అభ్యంతరం వ్యక్తం చేయగా మంత్రి సానుకూలంగా స్పందించారు. బేసిక్ మార్కెట్ విలువను వెంటనే రెండింతలు పెంచి రూ.3,75,000గా ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ పెంచిన విలువ ఆధారంగా భూసేకరణ చట్టం ప్రకారం మూడింతల పరిహారంతో పాటు గెజిట్ ప్రచురించిన తేదీ నుంచి వడ్డీ కలిపి ఎకరాకు మొత్తం రూ.11,50,000 చొప్పున చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మంత్రి నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేశారు.

పరిహార పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసి తక్షణమే అవార్డు కాపీలు మంజూరు చేయాలని ఆర్డీవో సుబ్రహ్మణ్యంకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

అసైన్డ్, పట్టా లేని రైతులకూ సమన్యాయం

సాధారణ పట్టాదారులతో పాటు అసైన్డ్ పట్టాలు కలిగిన రైతులకు కూడా సమాన పరిహారం ఇవ్వాలని గ్రామస్థులు కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అసైన్డ్ పట్టాదారులతో పాటు, ఎలాంటి పట్టాలు లేకుండా చాలాకాలంగా ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న పేద రైతులకు కూడా భూసేకరణ చట్టంలోని ‘3ఆర్’ నిబంధనల ప్రకారం పూర్తి పరిహారం చెల్లించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

40 వేల ఎకరాలకు సాగునీరు లక్ష్యం

కొల్లాపూర్ నియోజకవర్గంలోని వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో జూరాల ప్రాజెక్టు కింద 25 వేల ఎకరాలు, భీమా ప్రాజెక్టు కింద 15 వేల ఎకరాలు కలిపి మొత్తం 40 వేల ఎకరాల చివరి ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదని మంత్రి తెలిపారు.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా 2018లో సింగోటం–గోపాలదిన్నె లింక్ కెనాల్‌కు పరిపాలనా అనుమతులు మంజూరు చేయించినట్లు గుర్తుచేశారు. కెనాల్ నిర్మాణం కోసం మొత్తం 305.23 ఎకరాల భూమి సేకరించాల్సి ఉందన్నారు.

భూసేకరణ వివరాలు

నాగర్‌కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లి – 50 ఎకరాలు

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం – 73 ఎకరాల 13 గుంటలు

వల్లభాపూర్ – 87 ఎకరాల 3 గుంటలు

సంగినేనిపల్లి – 94 ఎకరాల 8 గుంటలు

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా భూసేకరణ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, బొల్లారం, తూముకుంట సర్పంచులు సుదర్శన్ రెడ్డి, రామన్ గౌడ్, సీనియర్ నాయకులు నారాయణరెడ్డి, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.