ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా,వచ్చే నెల ఏప్రిల్ 2వ తేదీ నుండి జిల్లాలో నిర్వహించనున్న గ్రామసభలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య మండల పరిషత్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు, జెడ్పీ సీఈఓ జానకిరెడ్డి తదితరులతో కలిసి నిర్వహించిన వీడియో సమీక్ష సమావేశంలో గ్రామసభల ఏర్పాటుపై సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.ప్రతి గ్రామసభ ఉదయం 10 గంటలకు ప్రారంభించాలని ఆదేశించారు . లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన వివరాలను ముందుగానే సిద్ధం చేయాలని, ప్రతి పథకం ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని అధికారులను ఆదేశించారు.
గ్రామసభలలో వ్యవసాయ శాఖకు సంబంధించిన రైతు భరోసా,రైతు బీమా,రుణమాఫీ, ధాన్యం కొనుగోలు,యాంత్రీకరణ పథకాలు,అలాగే ఆహార భద్రత కార్డులు,రేషన్ కార్డుల ద్వారా ఇంటింటికి సన్నబియ్యం పంపిణీ, చేయూత,మహాలక్ష్మి,గృహ జ్యోతి,మహిళాశక్తి,ఎస్‌హెచ్‌జీ రుణాలు, ఉపాధి హామీ పనులు తదితర ప్రభుత్వ పథకాలపై పూర్తి వివరాల సమాచారం అధికారుల వద్ద సిద్ధంగా ఉండాలని ఆదేశించారు . మహిళా రైతులకు రైతు బీమా, పింఛన్లు వంటి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. త్వరలో అమలు కానున్న ప్రభుత్వ కొత్త పధకం ఇందిరమ్మ కుటుంబ బీమా పధకం అన్నికుటుంబాలకు వర్తిస్తుందనే విషయాన్ని తెలియజేయాలని అన్నారు.ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకం, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా వంటి కొత్త పథకాల వివరాలు కూడా గ్రామసభలలో వివరించాలన్నారు.యువత, స్వచ్ఛంద సంస్థలు,రైతులు, మహిళా సంఘాలు తదితరులు గ్రామసభలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.మహిళలు,వృద్ధుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని,వేసవి దృష్ట్యా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.గ్రామసభల వివరాలను నోటీస్ బోర్డులలో ప్రదర్శించడంతో పాటు దండోరా, పోస్టర్ల ద్వారా గ్రామ ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.గ్రామసభలలో లబ్ధిదారుల జాబితాలు తప్పనిసరిగా సిద్ధంగా ఉంచాలని తెలిపారు.కొత్త దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రత్యేక కౌంటర్లు, ఫీడ్‌బ్యాక్ బాక్స్‌లు ఏర్పాటు చేయాలని, గ్రామసభలలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా అధికారులు కూడా ప్రతి గ్రామపంచాయతీకి హాజరై కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు.ఈవీడియో సమీక్ష సమావేశంలో మండల పరిషత్ అధికారులు,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.