ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్‌మెంట్,స్కాలర్షిప్‌ల వంటి కీలక విద్యా అంశాలపై చర్చ జరపకుండా ఇతర అంశాలపై సమయం కేటాయించడం దురదృష్టకరమని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ )నేతలు విమర్శించారు.సంగారెడ్డి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ సావుల ఆదిత్య మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ఇప్పసారాపై చర్చ జరపడానికి చూపుతున్న ఆసక్తి,విద్యారంగ సమస్యలపై చూపడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే స్కాలర్షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. విద్యా రంగ అభివృద్ధిపై చర్చించాల్సిన ప్రభుత్వం, ఇప్పసారాను లీగలైజ్ చేసి విక్రయించే అంశంపై రెండు రోజులపాటు చర్చించడం ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తుకు పునాది వేయాల్సిన విద్యార్థుల సమస్యలను విస్మరించడం సరైంది కాదని హెచ్చరించిన ఆదిత్య,ప్రభుత్వం వెంటనే మేల్కొని విద్యారంగానికి కేటాయించిన 8.2 శాతం నిధులను పెంచి కనీసం 15 శాతానికి చేర్చాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈసమావేశంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు మహేష్,సుధీర్,శివ,రంజిత్, తనుజ్ పాల్గొన్నారు.