Take a fresh look at your lifestyle.

కాకతీయుల నాటి విగ్రహాలు వెలుగులోకి

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
చారిత్రక ఆధారాలున్న నిర్మల్ లో మరో కీలక ఆధారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే శాతవాహన, రాష్ట్రకూట, చాళుక్య, కాకతీయ రాజవంశాల పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధి చెందినట్లు అనేక శాసనాలు, ప్రతిమలు, లిఖిత ఆధారాలు లభ్యమయ్యాయి.
తాజాగా నిర్మల్ పట్టణ సమీపంలో గండి రామన్న క్షేత్రం వద్ద రాతి గుట్టల మధ్య సహజ గుహలో కాకతీయుల కాలానికి చెందిన రెండు ఉమామహేశ్వర విగ్రహాలు గుర్తించినట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు డా. తుమ్మల దేవరావు తెలిపారు.
నల్లటి కఠిన శిల (బసాల్ట్)పై చెక్కిన ఈ విగ్రహాలు సుమారు క్రీ.శ. 10వ నుండి 11వ శతాబ్దాల మధ్యకాలానికి చెందినవిగా అంచనా వేస్తున్నారు. ఒక విగ్రహంలో ఉమాదేవి లలితాసనంలో శివుని ఒడిలో కూర్చుని ఉండగా, శివుడు జటాజూటధారిగా, శాంత స్వరూపంతో దర్శనమిస్తున్నాడని పేర్కొన్నారు. ఆయన చేతుల్లో డమరుకం, త్రిశూలం స్పష్టంగా కనిపిస్తున్నాయని వివరించారు. శిల్పకళలో శివ పార్వతులకు కాళ్లకు అందెలు, పట్టగొలుసులు, కర్ణాభరణాలు వంటి ఆభరణాలు సున్నితంగా చెక్కబడి ఉన్నాయంటే ఆ కాలం శిల్పుల నైపుణ్యం ప్రతిఫలిస్తుందన్నారు. విగ్రహం అడుగుభాగంలో శివుని వాహనం నంది ప్రతిష్ఠితంగా కనిపిస్తుందని తెలిపారు. కాగా
ఇదే గుహలో మరో ఉమామహేశ్వర విగ్రహం నంది వాహనం పై విరాజిల్లుతున్న దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అటవీ ప్రాంతంలో ఉన్న సహజ రాతి గుహలో ఈ విగ్రహాలు వేల సంవత్సరాలుగా నిలిచి ఉండటం విశేషంగా భావిస్తున్నారు.
ఉమామహేశ్వర స్వరూపం దాంపత్య సౌఖ్యం, కుటుంబ శాంతి, ఐక్యతకు ప్రతీకగా భావించబడుతుందని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్ర పర్యటనలో డా. తుమ్మల దేవరావుతో పాటు అబ్బడి రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.