ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్‌కర్నూల్ జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ మరియు ప్రాక్టికల్ పరీక్షల షెడ్యూల్‌ను జిల్లా నోడల్ అధికారి వెంకటరమణ విడుదల చేశారు. ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు, అలాగే ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాయదలచిన వారికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని తెలిపారు.
ఈనెల 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో ఫీజులు చెల్లించుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. థియరీ పరీక్షలు మే 13 నుండి మే 20, 2026 వరకు నిర్వహించబడతాయని తెలిపారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో జరుగుతాయి.
సైన్స్ విభాగానికి సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుండి మే 25 వరకు నిర్వహించబడతాయి. వీటి సమయం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష మే 26న ఉదయం 10 గంటల నుండి, మధ్యాహ్నం 2 గంటల నుండి నిర్వహించనున్నారు. పర్యావరణ విద్య పరీక్ష మే 28న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది.
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒక్కో పేపర్‌కు రూ.100, ప్రాక్టికల్ ఫీజు రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపుకు చివరి తేదీ ఏప్రిల్ 20గా నిర్ణయించారు. విద్యార్థులు గడువు లోపు నమోదు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.