డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రం – మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో 70 లక్షల రూపాయల వ్యయంతో తిప్పర్తి జంక్షన్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రి
పెద్ద సంఖ్యలో హాజరైన డా.బి.ఆర్ అంబేద్కర్,బాబు జగ్జీవన్ రామ్ అభిమానులు,ప్రజలు
నల్లగొండ,తిప్పర్తి:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పేదవాడి చేతిలో బ్రహ్మాస్త్రం అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకొని మంగళవారం నల్గొండ జిల్లా, తిప్పర్తి మండల కేంద్రంలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో 70 లక్షల రూపాయల వ్యయంతో తిప్పర్తి జంక్షన్ లో ఏర్పాటు చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ల కాంస్య విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అంతేకాక 10 కోట్ల 75 లక్షల రూపాయల వ్యయంతో సుందరీకరించిన తిప్పర్తి జంక్షన్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహిళల ఓటు హక్కు , అందరి చదువు కోసం ఎంతో కృషి చేశారని, అభివృద్ధి చెందేందుకు చదువే ముఖ్యమని అన్నారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని అందరూ చదువుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని, విద్యాభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని, నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీ కాలనీలో నిర్మిస్తున్న యంగ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను ఈ డిసెంబర్ చివరినాటికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించే ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే నియోజకవర్గానికి ఒకటి చొప్పున పబ్లిక్ స్కూల్ కూడా ఏర్పాటు చేయనున్నామని, గ్రామాలకు బస్సులు ఏర్పాటు చేసి వారి ఇంటి వద్ద నుండి విద్యార్థులను తీసుకువెళ్లి తీసుకువచ్చేందుకు ప్రభుత్వము చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. ముందుగా నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తామని, ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీష్ మీడియం రెండు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తిప్పర్తి మండలంలో రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగిందని, లబ్ధిదారులకు 135 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వగా, మరో 100 ఇండ్లను మంజూరు చేయడం జరిగిందని, మొత్తం మొత్తం 235 ఇండ్లు నెల రోజుల్లో లబ్ధిదారులకు ఇవ్వనున్నామని తెలిపారు. అలాగే కోటి రూపాయల వ్యయంతో తిప్పర్తి మండల కేంద్రంలో గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించడం జరుగుతున్నదని, ఇటీవలే 5 మహిళా సంఘాలకు ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంజూరు చేయడం జరిగిందని, రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలన్నారు. రోడ్లు, సంక్షేమ కార్యక్రమాలు అమలతో పాటు, ప్రత్యేకించి పిల్లల చదువు కోసం తన వంతు సహకరిస్తానని, అభివృద్ధితోపాటు ,విద్య అత్యంత అవసరం అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే తిప్పర్తి మండల కేంద్రానికి మరో 100 ఇండ్లు మంజూరు చేస్తానని, తిప్పర్తి మండల కేంద్రంలో డ్రైనేజీ కోసం 10 కోట్ల రూపాయల విడతలవారీగా ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఏఎమ్మార్పీ కాలువలకు 450 కోట్ల రూపాయలతో లైనింగ్ చేపట్టడం జరుగుతుందని, అది పూర్తయితే మండలంలోని చివరి భూములకు కూడా సాగునీరు అందుతుందని అన్నారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ మహిళలకు ఓటు హక్కు కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కృషి చేశారని అన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో కేంద్రంలో మహిళ బిల్లు కోసం ప్రయత్నం చేయడం జరిగిందని, యూపీఏ ప్రభుత్వ హయాం లోనే మహిళ బిల్లు కావాలని కోరడం జరిగిందని ,మహిళా బిల్లు కు తమ ప్రభుత్వ పూర్తి మద్దతు ఉంటుందని, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అవసరమని, అయితే దీని ద్వారా 50% సీట్లు పెరుగుతాయని, ఈ విషయంలో దక్షిణ భారత దేశానికి అన్యాయం జరిగిందని, మహిళా బిల్లు విషయమై రాష్ట్ర క్యాబినెట్లో ఇదివరకే చర్చించడం జరిగిందని, అవసరమైతే మరోసారి చర్చిస్తామని, దక్షిణ భారతదేశం ద్వారానే సగం జిడిపి దేశానికి అందుతున్నదని అలాంటిది దక్షిణ భారతదేశానికి అన్యాయం జరగకూడదని అన్నారు.
నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయానికి ప్రతీక అని, అణగారిన వర్గాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని, విద్య ,స్త్రీ పురుష సమానత్వానికి కృషి చేశారని అన్నారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో ముందుకు తీసుకు వెళుతున్నామని చెప్పారు .డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే పేద విద్యార్థులకు చదువు, రిజర్వేషన్లు వచ్చాయని, సమానత్వం వైపు అందరు అడుగు వేయాలని కోరారు. తిప్పర్తి జంక్షన్ సుందరీకరణ, సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించుకోవడం సంతోషకరంగా ఉందని అన్నారు. ఇదివరకు తిప్పర్తిలో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగిందని, అలాగే మండల కేంద్రానికి 5 మహిళా సంఘాలకు ఐకెపి కేంద్రాలను కేటాయించామని, రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కోరారు .
నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకిరి రమేష్, సర్పంచు రజిత ,వివిధ దళిత సంఘాల ప్రతినిధులు, తదితరులు మాట్లాడారు.
రెవెన్యూ ఆదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ రమేష్, ఆర్ అండ్ బి ఎస్ ఈ శ్రీధర్ రెడ్డి, డి ఈ గణేష్ ,డిసిసిబి డైరెక్టర్ సంపత్ రెడ్డి, పాశం రామ్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.