ముద్ర, యాదగిరిగుట్ట :
జాతీయ స్థాయి నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ- గవర్నెన్స్ 29వ జాతీయ సదస్సు న్యూఢిల్లీలో నిర్వహించగా యాదగిరిగుట్ట దేవస్థానం తరఫున కార్యనిర్వాహణాధికారి జె. భవానీ శంకర్ పాల్గొని ప్రజెంటేషన్ సమర్పించారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థలు చేపట్టిన డిజిటల్ సేవల పరివర్తన కార్యక్రమాలు ప్రదర్శించబడ్డాయి.
మొదటి దశలో దేశవ్యాప్తంగా మొత్తం 802 అప్లికేషన్లు అందగా, వాటిలో కేవలం 32 ప్రాజెక్టులు మాత్రమే షార్ట్‌లిస్ట్ చేయబడ్డాయి. ఈ ఎంపికలో తెలంగాణ రాష్ట్రం నుంచి యాదగిరిగుట్ట దేవస్థానం చోటు దక్కించుకోవడం విశేషమైన గౌరవంగా భావించబడుతోందని ఆయన అన్నారు.
రెండవ దశలో భాగంగా ఏప్రిల్ 08, 09 తేదీలలో జాతీయ అవార్డుల బృందం దేవస్థానాన్ని ప్రత్యక్షంగా సందర్శించి (ఆన్-స్పాట్ స్టడీ) సమగ్ర పరిశీలన నిర్వహించిందన్నారు. ఈ పరిశీలన నివేదికల ఆధారంగా స్క్రీనింగ్ కమిటీ మా ప్రాజెక్టును తదుపరి దశకు ఎంపిక చేయడం,
మూడవ దశలో మే 14 న దేవస్థానం బృందం ఢిల్లీకి వెళ్లి జ్యూరీ సమక్షంలో ఫైనల్ ప్రజెంటేషన్ సమర్పించిందన్నారు. ఈ ప్రజెంటేషన్ ప్రాజెక్ట్ హెడ్ ద్వారా సమగ్రంగా వివరించబడగా, జ్యూరీ సభ్యుల నుండి సానుకూల స్పందన లభించిందని యాదగిరిగుట్ట దేవస్థానం చేపట్టిన డిజిటల్ పరివర్తన కార్యక్రమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం విశేషమైన విషయమన్నారు. భక్తులకు పారదర్శకత, సౌలభ్యం, సమర్థతను అందించడంలో ఈ కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో యాదగిరిగుట్ట దేవస్థానం ప్రాధాన్యం రోజురోజుకు పెరుగుతూ, “తెలంగాణ తిరుపతి”గా ఖ్యాతి గడిస్తున్న నేపథ్యంలో, ఈ జాతీయ స్థాయి గుర్తింపు దేవస్థానానికి మరింత గౌరవాన్ని తీసుకువచ్చిందన్నారు.