Take a fresh look at your lifestyle.

కేంద్ర పునర్విభజన తో అంబేద్కర్ ఆలోచనలకు విఘాతం-అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం
ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గే ప్రమాదం

ముద్ర, తెలంగాణ బ్యూరో :

కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజకవర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీట్ల సంఖ్య తగ్గి ఆ వర్గాలు నష్టపోతాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అంతిమ లక్ష్యం రాజ్యాధికారం సాధించడమే అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలకు విఘాతం కలుగుతున్న సందర్భంలో దళితులు, మేధావులు ఈ విషయంపై ఆలోచనలు చేయాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ 135 వ జయంతిని‌ పురస్కరించుకొని మంగళవారం ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజాప్రతినిధులతో కలిసి ట్యాంక్‌బండ్ వద్ద ఆ అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగించారు. పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించి సమాజంలో సమాన విలువ, గౌరవం కల్పించిన నాయకుడు అంబేద్కర్ అన్నారు. మహిళా రిజర్వేషన్లతో నియోజకవర్గాల పెంపును ముడిపెట్టి కలగాపులగం చేయాలని ప్రయత్నిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు అని మొదట ప్రస్తావించారన్న సీఎం… అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తే దామాషా ప్రకారం 50 శాతం పెంచుతామని చెబుతున్నారని చెప్పారు. ఆ ప్రాతిపదిక ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య కేంద్రం అవాంతరాలు పెంచుతుందన్నారు. . దక్షిణాదిలో సీట్లు తగ్గడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వుడు సీట్లు తగ్గుతాయని చెప్పారు. ఏ లెక్కన దక్షిణాది కోటాను తగ్గిస్తారని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ల పెంపుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. చెప్పిన మాటపై నిలబడే ప్రభుత్వం తమది అన్నారు. చెప్పిన మాట ప్రకారం ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేసి చూపించిన రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే అన్నారు. కులగణన చేస్తామని చెప్పి. చేసి చూపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. మంచి పనికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుందన్నారు. రాజ్యాధికారమే అంతిమ లక్ష్యమని అంబేద్కర్ చెప్పిన మాటలు ఆచరణలోకి రావాలంటే మన సీట్లను సాధించుకోవాలన్నారు. అప్పుడే మన హక్కుల కోసం మాట్లాడగలమని చెప్పిన సీఎం.. ఆ మేరకు మేధావులు ఆలోచన చేయాలని కోరారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించవచ్చని మార్గదర్శకం చేసిన మహానాయకుడు అంబేద్కర్ అన్నారు. విద్య ఒక్కటే అన్ని సమస్యల నుంచి మనల్ని విముక్తి చేస్తుందని, జీవితాల్లో వెలుగులు నింపుతుందని, సమాజంలో సరైన గౌరవం దక్కుతుందని బలంగా విశ్వసించారన్నారు. అంబేద్కర్ ఆలోచనే ప్రజాపాలన విధానం అని చెప్పారు. రక్తం చిందించకుండా శాంతితో యుద్ధాన్ని గెలవొచ్చని మహాత్మగాంధీ ప్రపంచ దేశాలకు చాటిచెబితే, ఆ దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శంగా పరిపాలించవచ్చని నిరూపించిన వారు అంబేద్కర్ అన్నారు. ఈ దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు కళ్లలాంటి వారన్నారు. భారత రాజ్యాంగంలో అంబేద్కర్ జోడించిన ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలే ముందు భాగంలో నిలిచి పోరాటం చేశారని సీఎం వ్యాఖ్యానించారు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన గద్దరన్న, మారుమూల పల్లెల్లో జయ జయహే తెలంగాణను మారుమోగించిన అందెశ్రీని సీఎం స్మరించుకున్నారు. దళిత, గిరిజన సామాజిక వర్గానికి మంత్రిపదవులు, ఇతర పదవులు, అధికారులకు ప్రాధాన్యత విషయాల్లో గత ప్రభుత్వాలకు, ప్రజాప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను పోల్చుకోవాలని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలోనే అత్యధిక ప్రాధాన్యత దక్కిందని అనేక ఉదాహరణలు చెప్పారు. కులాల మధ్యన విభజన జరుగుతుందని, సమాజంలో మరింతగా అంతరాలు పెరుగుతున్నాయని ఆలోచన చేసి ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. దేశానికి భవిష్యత్తును అందించే దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పేదలకు నాణ్యమైన విద్య అందడం లేదని, నాణ్యమైన విద్యను అందించడానికి అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లలో అత్యధికంగా దళితులకు ఇచ్చామన్న సీఎం.. 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలు నియమిస్తే అందులో 87 శాతం ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఉద్యోగాలొచ్చాయన్నారు. సివిల్ సర్వీసెస్ లో ప్రోత్సహించాలని రాజీవ్ గాంధీ అభయహస్తం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. ఒకవైపు అప్పులు, తప్పులను సవరిస్తూనే రాష్ట్రంలో పరిపాలనను చక్కబెడుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి అందించాలన్న మంచి లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. ప్రజల కోసం అందిస్తున్న ప్రజాపాలనను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.