- కోర్టుల్లో మాతృ భాష అమలు యోచనలో కేంద్రం
- వాదనలు, తీర్పులు తెలుగులోనే ఉండాలి
- మన భాషను మనమే విస్మరించుకుంటున్నాం
- ప్రతి ఇంట్లో పెద్ద బాలశిక్ష తప్పక ఉండాలి
- ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే సాగాలి
- తెలుగు మహాసభలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో : మన వాడుక భాష తెలుగులో 30 శాతం మాత్రమే తెలుగు ఉందని, మిగిలిన 70 శాతం అంగ్లపదాలే ఉన్నాయని, మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాష కనుమరుగు కాకముందే రక్షించుకోవల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన చెప్పారు. ప్రతి ఇంట్లో పెద్ద బాలశిక్ష తప్పనిసరిగా ఉండాలని, చిన్నారుల చేత నిత్యం బాలసాహిత్యాన్ని చదివించాలని ఆయన సూచించారు. మాట్లాడటం, రాయడం ద్వారా మాత్రమే మాతృబాషను కాపాడుకోగలమని ఆయన తెలిపారు.
ఈ మేరకు శనివారం నాడు హైదరాబాద్ లో జరుగుతోన్న ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలుగు భాషను బోధనా భాషగా ప్రాచుర్యంలోకి తేవాలన్నారు. పాలన, అధికార వ్యవహారాలు తెలుగు భాషలో జరగాలని సూచించారు. ప్రాథమికస్థాయి వరకు విద్య కూడా తెలుగులో ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ప్రాంతీయ భాషల పరిరక్షణకు పెద్దల సహకారం అవసరమన్నారు. కోర్టుల్లో వాదనలు, ప్రతివాదనలు తెలుగులో ఉండాలని, కోర్టు తీర్పులు, సినిమాల పేర్లు తెలుగులోనే ఉండాలన్నారు. కోర్టుల్లో మాతృభాష అమలు యోచనలో కేంద్రం ఉందన్నారు. వికీపీడియాలో తెలుగు వ్యాసాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు చెప్పారు. కథలు, వ్యాసాలు ఆడియోల రూపంలో అందుబాటులో ఉన్నాయన్నారు. తెలుగు భాషను డిజిటల్ విభాగంలోనూ క్రోఢీకరించి భావితరాలకు అందించాలన్నారు. డిజిటల్ రంగం పరంగానూ మాతృభాష అభివృద్ధి, సంరక్షణకు దోహదం చేయాలన్నారు.
దేశ భాషలందు తెలుగు లెస్స
‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అని ఊరికే అనలేదని, తెలుగు భాష ప్రపంచంలోనే అత్యంత అందమైన భాష, తెలుగు పదాలు, శ్రావ్యంగా వినేవారికి సంగీతాన్ని విన్నట్టు అనిపిస్తుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ”మా తెలుగు తల్లికి మల్లె పూదండ ”అంటూ పాడుకునే పాటతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు ఒకే వేదికపైకి రావడం తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు కళలు, తెలుగు సంప్రదాయాల కోసం పాటు పడటం చాలా సంతోషంగా ఉంది. భారత దేశంలోని ప్రాచీన భాషల్లో తెలుగు ఒక్కటని అన్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, సంస్క-తం ప్రాచీన భాషలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించాయన్నారు.
నిజాం కాలంలో తెలుగుపై వివక్ష
నిజాం కాలంలో తెలుగు భాషపై అణచివేత కొనసాగింద కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆ రోజుల్లో ఉర్దూ మీడియం పాఠశాలలే ఉండేవని, తెలుగు వాళ్లు అక్కడే చదువుకోవాల్సి వచ్చేదన్నారు. నిర్బంద కాండ కొనసాగిందని, అంత నిర్బంధంలో కూడా నాడు గ్రంథాలయోద్యమం, ‘ఆంధ్రా మహాసభ’ పేరిట తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు అనేక పోరాటాలు సాగాయని ఆయన చెప్పారు. యక్షగానం, భాగవతం, నాటకం వంటివి తెలుగు భాషకే ప్రత్యేకమైన కళా రూపాలని అన్నారు. ప్రపంచంలో అవధానం అనేది తెలుగు, సంస్కృతంలో తప్పిస్తే మరే భాషలోనూ కనపడదని కిషన్ రెడ్డి తెలిపారు