Take a fresh look at your lifestyle.

మాతృ మరణాల తగ్గింపు, సి-సెక్షన్ నియంత్రణ పై ప్రత్యేక దృష్టి-సురక్షిత మాతృ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి దామోదర

రాష్ట్రవ్యాప్తంగా మిడ్‌వైఫరీ సేవలు బలోపేతం
సురక్షిత మాతృ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి దామోదర
మహిళ, ప్రతి తల్లి సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలి
పోషణ కౌన్సెలింగ్ బలోపేతంపై దృష్టి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మహిళా, శిశు మరణాలను తగ్గించడం ద్వారా ప్రసవం తర్వాతా ఇరువురు సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. తెలంగాణలో అధికంగా ఉన్న సి-సెక్షన్ శాతాన్ని తగ్గించేందుకు మిడ్‌వైఫరీ సేవలను బలోపేతం చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మహిళా కేంద్రిత ఆరోగ్య సేవలను విస్తరించడంపై దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.

మిడ్‌వైఫరీపై ప్రత్యేక విధానాన్ని రూపొందించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహిస్తామన్న మంత్రి.శిశు మరణాల రేటును సింగిల్ డిజిట్‌కు తీసుకురావడంపై ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. బుధవారం సికింద్రాబాద్ బోయిగూడ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సురక్షిత మాతృత్వ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మాతృత్వం ఒక గొప్ప వరమని, ప్రతి గర్భిణి సురక్షితంగా, ఆరోగ్యంగా ప్రసవం జరిగేలా ఉండాలని ఆ మేరకు వైద్యాధికారులు నిరంతరం అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. వైద్య విభాగంలో వైద్యులు, సిబ్బంది అత్యధికులు మహిళలే కావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ ,  అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపికలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు మహిళలు ఎంపికైన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ వైద్య ఆరోగ్య శాఖ క్రిస్టినా చోంగ్తు మాట్లాడుతూ సురక్షిత మాతృత్వం కోసం యవ్వన దశ నుంచే ఆరోగ్య అవగాహన, పోషణ, మెన్స్ట్రువల్ హైజీన్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్య మహిళ క్లినిక్‌ల ద్వారా మహిళలకు ప్రత్యేక స్క్రీనింగ్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. స్క్రీనింగ్ అనంతరం రిఫరల్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. రాష్ట్రంలో 99.9 శాతం సంస్థాగత ప్రసవాలు ఉన్నప్పటికీ సి-సెక్షన్ పెరుగుతున్న నేపథ్యంలో మిడ్‌వైఫరీ సేవలను అన్ని నర్సింగ్ కళాశాలలకు విస్తరించాలని సూచించారు. ప్రసవానంతర తొలి 14 రోజుల్లో గృహ సందర్శనలు కీలకమని, ఈ వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు.
మహిళా  శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్ మాట్లాడుతూ ఆరోగ్య శాఖతో సమన్వయంతో గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, చిన్నపిల్లలకు సమగ్రమైన మెరుగైన సేవలు అందుతున్నాయని ఆమె పేర్కొన్నారు.  రాష్ట్రంలో అనీమియా ప్రధాన సమస్యగా ఉన్నందున ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా రోజుకు 2 లక్షలకుపైగా గర్భిణీలకు పోషకాహారం అందిస్తున్నామని అన్నారు.  ప్రసవానంతర తల్లులకు కూడా ఆరు నెలలపాటు పోషకాహారం అందిస్తున్నామని,  తల్లులు , శిశువులకు సరైన పోషణ, తల్లిపాలు, శిశు సంరక్షణపై కౌన్సెలింగ్ సేవలను మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ 99 రోజుల కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ఆరోగ్య శిబిరాలు నిర్వహించినట్లు తెలిపారు. పిహెచ్‌సీలలో 740 ప్రత్యేక శిబిరాలు నిర్వహించి సుమారు 15 లక్షల మందికి వైద్య సేవలు అందించామని తెలిపారు. గ్రామ స్థాయిలో 65 వేలకుపైగా హెల్త్ క్యాంపులు నిర్వహించి 1.80 లక్షల యాంటీనేటల్ చెకప్‌లు చేసినట్లు వివరించారు. 1.64 లక్షల మందికి అనీమియా స్క్రీనింగ్ చేసి ఐఎఫ్‌ఏ మాత్రలు అందించామని అన్నారు.  ప్రతి గర్భిణికి హెచ్‌ఐవి, సిఫిలిస్, హెపటైటిస్, టిబి పరీక్షలు నిర్వహిస్తూ హై రిస్క్ గర్భధారణలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో మాతృ ఆరోగ్య పరిరక్షణ, పోషణ, కౌన్సెలింగ్ తో పాటు సేవల బలోపేతంపై తీసుకుంటున్న చర్యలపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన మహిళలు తమ అనుభవాలను పంచుకుని ప్రభుత్వం ద్వారా అందుతున్న వైద్య సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి గర్భిణీ స్త్రీల పోషణ, గర్భధారణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోషక ఆహారం, మందుల వినియోగంపై ఏర్పాటు చేసిన ప్రదర్శన స్టాల్స్‌ను పరిశీలించారు.  అనీమియా ముక్త  భారత్ కార్యక్రమం సంబంధించిన   ఈ-లెర్నింగ్ మాడ్యూల్స్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డా. రవీంద్ర నాయక్, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డా. నరేంద్ర, తెలంగాణ వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ డా. అజయ్, ఆయుష్ డైరెక్టర్ డా. శ్రీకాంత్, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ సంస్థ ఛైర్‌పర్సన్ డా. కవిత, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. వెంకటి, యూనిసెఫ్ ప్రతినిధులు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అధికారులు పాల్గొన్నారు. మరోవైపు రాష్ట్రంలో అత్యధికంగా నార్మల్ డెలివరీలు చేసిన ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రానికి చెందిన గైనకాలజిస్ట్ వైద్యురాలు ఎం. శ్రీలతను మంత్రి దామోదర రాజనర్సింహా.. హైదరాబాదులోని రవీంద్ర భారతిలో అవార్డుతో సత్కరించారు. శ్రీలత గతంలోనూ ఈ అవార్డును అందుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.