Take a fresh look at your lifestyle.

మైనర్ బాలికపై అఘాయిత్యం -నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 20 వేల జరిమాన -వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:
వికారాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక లైంగిక దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష మరియు 20 వేల రూపాయల జరిమానా విధిస్తూ వికారాబాద్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు వివరాలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా వెల్లడించారు.
2023లో వికారాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నెం: 150/2023 ప్రకారం వికారాబాద్ మండలానికి చెందిన అత్వెల్లి నరేందర్ (అలియాస్ నరేష్) అనే వ్యక్తి ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు పోక్సో చట్టం మరియు ఇతర ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణ వికారాబాద్‌లోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి చంద్ర కిషోర్ సమక్షంలో వాదనలు వినిపించారు. పోలీస్ అధికారులు సమర్పించిన శాస్త్రీయ సాక్ష్యాధారాలను పరిశీలించిన గౌరవ న్యాయమూర్తి, నిందితుడిపై నేరం రుజువు కావడంతో అతనికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధించారు. అంతేకాకుండా, బాధితురాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పరంగా రూ. 5 లక్షల నష్టపరిహారాన్ని అందజేయాలని కోర్టు ఆదేశించింది. నిందితుడికి కఠిన శిక్ష పడేలా పకడ్బందీగా వ్యవహరించిన అధికారులను మరియు సిబ్బందిని ఎస్పీ స్నేహ మెహ్రా ప్రత్యేకంగా అభినందించారు. నాటి దర్యాప్తు అధికారులు శ్రీను (అప్పటి వికారాబాద్ సి.ఐ), బి.వి. సత్యనారాయణ (అప్పటి వికారాబాద్ ఎస్‌డిపిఓ), అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి మెరాజ్ ఫిర్దోస్, ప్రస్తుత సీఐ కె. రఘు కుమార్, కోర్టు లైజనింగ్ ఎస్. నిరంజన్ గౌడ్, భరోసా సెంటర్ ప్రతినిధులు శ్వేత (ఎస్‌ఐ), కీర్తి ఆకుల, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ ఎల్. నరేందర్ (ఏ.ఎస్.ఐ), జి. మణిక్ ప్రభు (పీసీ)లను ఎస్పీ ప్రశంసించారు.
మహిళలు మరియు చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా లేదా నేరాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని ఆమె స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.