– కాంగ్రెస్ పార్టీ లో మూడు ముక్కలాట.. ముగ్గురి నేతల మధ్య దిక్కుతోచని స్థితిలో అభ్యర్థులు
– ఓ వైపు సీనియర్ నేత చిన్నారెడ్డి, మరో వైపు ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఇద్దరి కంటే నేనేమి తక్కువ కాదంటూ శివసేనా రెడ్డి
– అధిష్టానం వార్నింగ్ తో అభ్యర్థుల ఎంపికలో ముగ్గురు నేతల ఏకాభిప్రాయం
– ఎంపిక అనంతరం ఎవరి ప్రచారం వారిదే అన్నట్లు ఎడమోహం.. పెడమోహం
– ఎమ్మెల్యే కు సంబందం లేకుండా చిన్నారెడ్డి ఒంటరి ప్రచారం… ఇది నచ్చలేదంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం మండిపాటు
– వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీ లపై గురి పెట్టిన ఎమ్మెల్యే మేఘారెడ్డి
……………………………………..
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
కాంగ్రెస్ పార్టీ కి కొత్తగా ఎవ్వరూ శత్రువు లు పుట్టుకురారు… ఆధిపత్య పోరు కోసం ఆ పార్టీ వారే ఎవరికి వారు శత్రువులుగా మారిపోతారు. ఇంత లోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. అయినా పట్టు వీడరు. అధిష్టానం తలంటితే తప్పా కళ్లు తెరవరు. చేతులు కాలాక ఆకులు పట్టుకునే చందంగా మారుతుంది కాంగ్రెస్ నేతల పరిస్థితి.అచ్చం ఇలాంటి పరిస్థితి వనపర్తి జిల్లా మున్సిపాలిటీ లో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. ఇక్కడ ముగ్గురు నేతల మధ్య కొన్నేళ్లుగా అధిపత్య పోరు కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ ముగ్గురు ప్రధాన నేతల కార్యకర్తలు విసిగిపోయారు. అయినా ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ పోరు బహిర్గతమవుతోంది. మాజీ మంత్రి, ప్రస్తుతం ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ జిల్లెల్ల చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షులు శివసేనారెడ్డి మధ్య వర్గ పోరు నడుస్తూనే ఉంది. వీరి మధ్య ఉన్న అధిపత్య పోరును దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల ఎంపిక విషయం లో ఏకాభిప్రాయం ఉండాలని వార్నింగ్ ఇచ్చింది. ఈ విషయం దృష్టిలో పెట్టుకున్న ముగ్గురు నేతలు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థుల ఎంపికలో ఒక్కటయ్యారని బయటకు కనపడినా లోలోపల ఎవరి వర్గం వారికి వారు టికెట్లు ఇప్పించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఎవరికి వారు ప్రచారం చేస్తున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి, శివసేన రెడ్డి కొన్ని వార్డు ల్లో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ చిన్నారెడ్డి మాత్రం వీరిద్దరిని కలుపుకోకుండా ఒక్కరే ప్రచారం చేసుకుంటూ వెళుతుండడంతో వీరి మధ్య ఇంకా అధిపత్య పోరు పోలేదని కార్యకర్తలు అంటున్నారు. మీరు మీరు ఏమైనా చేసుకోండి ఇక్కడ విజయం సాధించకుంటే చర్యలు తప్పవనే సంకేతాలు పార్టీ అధిష్టానం పంపించింది.ఈ సంకేతం చిన్నరెడ్డి కి పెద్దగా వర్తించకున్నా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాత్రం కాస్తా నష్టం జరిగే అవకాశం ఉంటుంది.అందుకే వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీ లలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని మేఘారెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆధిపత్య పోరులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అయోమయం లో ఉన్నారు.
……………………………………….
ఎవరి ధీమా వారిదే :
………………………………………
వనపర్తి నియోజకవర్గం లో ఉన్న వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీ లలో జరుగుతున్న ఎన్నికలు టగ్ ఆఫ్ వార్ గా నడుస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కి ధీటుగా బీ ఆర్ ఎస్ పార్టీ బలమైన శక్తి గా ఉంది. వనపర్తి మున్సిపాలిటీ లోని 33 వార్డుల్లో 25 వార్డుల్లో విజయకేతనం ఎగురవేస్తామని ఎమ్మెల్యే మేఘారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. 30 వార్డులను గులాబీ పార్టీ వశం అవుతాయని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొంటున్నారు. ఈ మున్సిపాలిటీ లో 2019 లో నాగవరం, రాజానగరం, నర్సింగాయిపల్లి, శ్రీనివాసపురం గ్రామాలు విలీనమాయ్యాయి.
దీంతో ఈ మున్సిపాలిటీ పరిధి విస్తరించింది. 33 వార్డులుగా విభజన జరిగింది. ఈ మున్సిపల్ వార్డుల్లో జనరల్ 8,జనరల్ మహిళ 8,బీసీ జనరల్ 6,బీసీ మహిళ 5,ఎస్సీ లకు 2,ఎస్టీ జనరల్ కు ఒకటి, ఎస్సీ మహిళ 3 స్థానాలకు రిజర్వేషన్ కల్పించారు. ఇందులో మేజిక్ ఫిగర్ 17 స్థానాల్లో విజయం సాధించాలి.కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి లో సోమవారం ప్రచారం నిర్వహించారు. బీ ఆర్ ఎస్ కు మాత్రం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఒక్కరే ‘ ఏక్ నిరంజన్’ గా ప్రచారం లో దూసుకుపోతున్నారు. పలు వార్డుల్లో భారతీయ జనతా పార్టీ కూడా బలమైన నాయకత్వం కల్గివుంది. ఈ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. ఐదు నుంచి పది స్థానాల్లో విజయం పొంది చైర్మన్ ఎంపిక లో కింగ్ మేకర్ అవుతామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.ఈ మున్సిపాలిటీ 22 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇందులో బలమైన క్యాడర్ ఉన్న అభ్యర్థులు కూడా ఉన్నారు. ఈ అభ్యర్థులు పార్టీ ల అభ్యర్థులకు ధీటుగా ప్రచారం చేస్తున్నారు.వీరి వల్ల కొన్ని వార్డుల్లో ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి ఉంది. ఇదే జరిగితే స్వతంత్ర అభ్యర్థులు మున్సిపల్ చైర్మన్ ఎంపిక లో కీలకంగా మారే అవకాశం లేకపోలేదు.కాంగ్రెస్, బీ ఆర్ ఎస్, బీజేపీ మధ్య లో స్వతంత్ర అభ్యర్థులు ఎవరి గెలుపు ధీమా లో వారున్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.