ముద్ర, దేవరకొండ :
బీసీల కుల గణన చేపట్టి, చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం దేవరకొండ నియోజకవర్గంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ బీసీ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని చెప్పారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నియోజకవర్గ పరిధిలోని సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులను ఆయన శాలువా కప్పి, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఇదే వేదికపై ప్లాస్టిక్ వినియోగం – పర్యావసనాలు అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆర్. కృష్ణయ్య బహుమతులు అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ, పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్. అరుణ్ కుమార్, వరికుప్పల శ్రీను, వెంకటయ్య, ఏరుకొండ రాము, చోల్లేటి భాస్కరాచారి, భీమగోని శివ గౌడ్, చెరుపల్లి జయలక్ష్మి, వనం చంద్రకళ, కొండ్ర శ్రీశైలం యాదవ్‌తో పాటు పెద్ద సంఖ్యలో ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.