- పాక్ ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ దాడులు.
ప్రపంచమంతా నిదరోతున్న అర్ధరాత్రి వేళ – భారత ప్రతీకారాగ్నితో ప్రత్యర్థి పాక్ గగన తలం సింధూర కాంతులతో ఎరుపెక్కింది.పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో టెర్రరిస్టులు దాక్కున్న తొమ్మిది కలుగుల్లోకి దూరి భారతీయ విస్ఫోటక అస్త్రాలు నేలమట్టం చేశాయి.వాటిల్లో దాక్కున్న టెర్రరిస్టులు ఎంతమంది చచ్చారో లెక్క తేలాల్సివుంది. అంచనాకైతే వందమందికి పైనే వుంటారని తెలుస్తోది.అర్ధరాత్రి చిమ్మచీకట్లో ఫెళఫెళార్భటాలతో శత్రుభూమిలో నిప్పులు కురిపిస్తూ భారత్ జరిపిన ఈ దాడి ‘ఆపరేషన్ సింధూర్’ అని నామకరణం చేశారు. తెల్లారేసరికల్లా ఈ దాడుల గురించి తెలిసి యావత్తు ప్రపంచం ఉలిక్కి పడింది. పాకిస్తాన్ వెన్నులో అయితే వణుకే పుట్టింది.ఉన్మాదుల కాల్పుల్లో తమ భర్తల్ని కోల్పోయిన భారత స్త్రీలు – ముష్కర స్థావరాల్ని పేల్చేసిన భారతీయ అస్త్రాల రగిల్చిన సింధూర కాంతులను చూసి గర్వంతో ఉప్పొంగే వుంటారు.చరిత్రలో నిలిచిపోయే ఈ భారతీయ ప్రతీకార దాడికి ప్రపంచదేశాలన్నీ దన్నుగా నిలిచాయి.భారత్ ను దోషిగా నిలబెట్టాలని చివరి క్షణంలో పాకిస్తాన్ భద్రతాసమితిలో చేసిన దింపుడు కళ్లెం ప్రయత్నం బెడిసికొట్టింది.
ఒక్కదేశం కూడా పాక్ తో కలిసి రాలేదు.రెండువాలాల పాటు పకడ్బందీగా గా తెరవెనుక యుద్ధ వ్యూహాలు పన్ని, అందరి మద్దతు కూడగట్టి, పటిష్టమైన నిఘా వ్యూహం పన్ని నిర్వహించిన ఈ ఆపరేషన్ కు ప్రధాని మోడీ స్వయంగా ‘సింధూర్’ అని నామకరణం చేశారు.కాగల కార్యం మన సేన అత్యంత పకడ్బందీ వ్యూహంతో ఎగ్జిక్యూట్ చేసింది.మతం పేరిట జరిపిన మారణహోమంలో నిష్కరణంగా ప్రాణాలు కోల్పోయిన అమాయక హిందూ పర్యాటకుల ఆత్మలు శాంతించాయని భావిద్దాం.ఇంతటితో ఊరుకో.. దుస్సాహసానికి దిగితే సర్వనాశనం తప్పదు అని అమెరికా పాకిస్తాన్ కి చేసిన హెచ్చరికతో కూడిన హితవుకి తల ఒగ్గిందా సరే.. లేకుంటే మళ్ళీ కల్లో కూడా వూహించడానికి భయంతో చచ్చేలా గుణపాఠం చెప్పడానికి భారతీయ సేన మోహరించింది.