- ఆస్తమా వ్యాధిపై అవగాహన పెంచుకోవాలి.
ముద్ర న్యూస్ బ్యూరో హైదరాబాద్: ఉచ్ఛ్వాస, నిశ్వాస సజావుగా సాగితేనే మనిషి మనుగడ సాధ్యమని, శ్వాస ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ విష్ణు రావు అన్నారు.ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా, హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆసుపత్రిలో ఆస్తమా వ్యాధి గ్రస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా వచ్చిన మీడియా అకాడమీ ఛైర్మన్, ఐజీయూ అధ్యక్షుడు కె శ్రీనివాస్ రెడ్డి, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యుడు కే సత్యనారాయణ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ద్వారకానాథ్ రెడ్డి ఆస్తమా వ్యాధిగ్రస్తులకు నూతన టెక్నీలాజీ తో వచ్చిన ఇన్ హేలర్స్ ను అందజేశారు.శ్వాసకు అడ్డంకులు ఏర్పడుతుంటే ఆ నరకం అనుభవించిన వారికే తెలుస్తుందని విష్ణు రావు అన్నారు. ఆస్తమా రోగులకు ఊపిరి తీసుకోవడం ఒక్కోసారి ప్రాణం పోయినంత పని అవుతుందని తెలిపారు.మనుషుల జీవనశైలి, వాతావరణ కాలుష్యం ప్రధానంగా ‘ఆస్తమా’ను పెంచి పోషిస్తున్నాయని పేర్కొన్నారు.చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కూడా ఆస్తమాతో సతమతం అవుతున్నవారున్నారన్నారు.ఒకసారి ఆస్తమా వచ్చిందంటే పూర్తిగా వదిలి పోవడం చాలా కష్టమని, మొదటిదశలో వైద్యులను సంప్రదిస్తే సరైన జాగ్రత్తలతో వ్యాధిని నియంత్రించొచ్చునని పేర్కొన్నారు.ఈ సంవత్సరం ఇన్ హేలర్స్ అందరికీ అందుబాటులో ఉండాలన్న నినాదంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. అత్యాధునిక శాస్త్రీయ వైద్యం అందుబాటులో వస్తున్నప్పటికీ, జబ్బులు కూడా అదే రీతిలో విజృంభిస్తున్నాయని, ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమని, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
