Take a fresh look at your lifestyle.

మారథాన్ తో ఆరోగ్య చైతన్యం, క్రీడాస్ఫూర్తి పెంపొందుతుంది… ఎమ్మెల్యే సంజయ్ కుమార్….

జగిత్యాలలో 5k మారథాన్…

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:

మారథాన్ తో ప్రజల్లో ఆరోగ్య చైతన్యం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి పెంపొందుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే మారథాన్‌ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజ గౌడ్‌తో కలిసి సోమవారం ప్రారంభించారు. జగిత్యాల పట్టణంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ మారథాన్‌లో యువత, విద్యార్థులు, క్రీడాకారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి రోజు యోగ సాధన ద్వారా ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందని, ఆరోగ్యమే మహాభాగ్యమని,
ప్రతి మనిషి జీవితంలో యోగ, వాకింగ్, వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని సూచించారు. నేటి విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా ముఖ్యమంత్రి గ్రామీణ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు సీఎం కప్ పోటీలు నిర్వహించారని, గ్రామీణ నైపుణ్యం గల క్రీడాకారులను వెలికి తీయడమే సీఎం కప్ ముఖ్య ఉద్దేశమన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో క్రీడలు, క్రీడా మైదానాల అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడల అధికారి రవి కుమార్ , మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు, కోచ్‌లు, క్రీడాకారులు, యువజన సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.