ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
జిల్లాలోని రా రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించి ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని దించుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హైమావతి సూచించారు.సోమవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో జిల్లాలోని రా రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి వారి మిల్లులలో వరి ధాన్యాన్ని దించుకోవడంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈసారి రబీ సీజన్లో తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరిధాన్యం పండిందని వాటిలో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఇప్పటికే 1లక్షా 80 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని రేపట్లోగా మరొక 20 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని తెలిపారు. వాతావరణం అనుకూలించి అధికంగా ధాన్యం దిగుబడి వచ్చిందని అన్నారు. గ్రామాల వారీగా రైస్ మిల్లుల వారిగా ధాన్యాన్ని కేటాయిస్తామని జిల్లాలోని రా రైస్ మిల్లర్లు వారి మిల్లులో 40 శాతం కెపాసిటీతో మొత్తం 1లక్షా 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని సూచించారు. రానున్న ఖరీఫ్ సీజన్లో జిల్లాలో అధిక శాతం సన్న రకం వరి ధాన్యాన్ని రైతులతో పండించేందుకు ప్రభుత్వ ఆదేశాలు మేరకు రైతులను మోటివేట్ చేస్తున్నామని మిల్లర్లు కూడా రైతులకు సన్న రకం వరి ధాన్యాన్ని పండించడంపై చైతన్యం తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ గోపికృష్ణ, రా రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.