- నాలుగు సీజన్లుగా అదే నిర్లక్ష్యం.
- అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ యూరియా కొరతపై లేదా?
- రైతుల పట్ల, వ్యవసాయం పట్ల కాంగ్రెస్ కు ఉన్న చిత్త శుద్ధి ఇదేనా.
- మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం.
ముద్ర, తెలంగాణ బ్యూరో: పంట బీమా అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదర గొట్టిన సీఎం రేవంత్ రెడ్డి నాలుగు సీజన్లుగా పంట బీమా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. మాటలు కోటలు దాటితే, రేవంత్ ప్రభుత్వ నిర్ణయాలు ఆచరణ గడప కూడా దాటదన్నారు. ఇందులు. ఇప్పటికీ అమలు కాని పంటల బీమా మరో ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తే హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చాక ‘మొండిచేయి’ చూపడం హస్తం పార్టీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, రోట్లో తలపెట్టిన చందంగా మారింది రైతుల పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.‘వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంట బీమా పథకం తెస్తాం’ అని అభయ హస్తం మేనిఫెస్టో, వరంగల్ రైతు డిక్లరేషన్ లో హామి ఇచ్చారని గుర్తు చేశారు. ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పంట బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తాం’ అని ఇప్పటి వరకు ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్ ప్రసంగాల్లోనూ (ఓటాన్ అకౌంట్ తో సహా) చెప్పారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామికి, బడ్జెట్ లో చెప్పిన మాటకు విలువ లేకుండా పోయిందన్నారు.గత బడ్జెట్ లో రూ. 1300 కోట్లు కేటాయించి, కేవలం కాగితాలకే పరిమితం చేసారు తప్ప రూపాయి విదిల్చింది లేదన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు పంటల బీమాకు అతీగతీ లేక పోవడం కాంగ్రెస్ మార్కు రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనమన్నారు. నిజంగా పంట బీమా అమలు చేయాలనే చిత్తశుద్ది గనక ఉంటే, మే, జూన్ నెలల్లోనే టెండర్లు పిలవాల్సి ఉందన్నారు. కానీ ఆ ప్రక్రియ ఇప్పటికీ చేపట్టక కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని మండిపడ్డారు. అకాల వర్షాలు, వడగండ్లు, ఇతర విపత్తులు వచ్చిన ప్రతిసారి సాయం అందక రైతన్నలు మరింత చితికిపోతున్నారని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన విమర్శించారు.పంట బీమా అమలు చేయకపోవడం, రైతు భరోసా సరిగ్గా ఇవ్వకపోవడంతో రైతులు అప్పుల పాలై కోలుకోవడం లేదన్నారు.సర్వేల పేరుతో కాలయాపన తప్ప, నష్ట పరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వ్యవసాయం, రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నదన్నారు.ఇప్పటికే రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టారు.. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అటకెక్కించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.రుణమాఫీ చారాణ చేసి బారాణ మందిని మోసం చేసారన్నారు. అన్ని పంటలకు బోనస్ అని, సన్నాలకే పరిమితం చేశారన్నారుసన్నాలకు రూ. 1200 కోట్ల బోనస్ డబ్బులను ఇప్పటికీ చెల్లించక రైతులకు బాకీ పడ్డారని పేర్కొన్నారు.పంట బీమా అని నాలుగు సీజన్లుగా ఉసూరుమనిస్తున్నారని అన్నారు.మరోవైపు యూరియా కొరత వేదిస్తున్నా ప్రభుత్వానికి ఉలుకులేదు పలుకులేదన్నారు.అందాల పోటీల రివ్యూలపై పెట్టిన శ్రద్ధ ఒక్కటైనా రాష్ట్రంలోని యూరియా సరఫరా కొరకు పెట్టి ఉంటే యూరియా కొరత వచ్చేది కాదన్నారు. రాష్ట్రంలోని అన్ని సహకార సొసైటీలలో ఇదే పరిస్థితి అని అన్నారు. నాట్లు పడకముందే యూరియా కొరత ఏర్పడితే, రైతుల పట్ల మీ శ్రద్ధ ఏ పాటి ఉందో స్పష్టంగా తెలుస్తోందన్నారు.ఇప్పటికైనా వైఖరి మార్చుకొని రైతు సంక్షేమం మీద శ్రద్ధ పెట్టకుంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రైతాంగం నుండి తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కోక తప్పదన్నారు.అన్ని కోణాలలో రైతును వంచించి, వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేస్తూ, పండుగ చేశామంటూ డబ్బా కొట్టుకుంటూ సంబరాలు చేసుకున్న ఘనత రేవంత్ ది అని మండిపడ్డారు.ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి, ఎన్నికల మేనిఫెస్టోలో, బడ్జెట్ ప్రసంగాల్లో పంట బీమా అమలు చేస్తామని చెప్పిన మాటను నిలుపుకోవాలని, యూరియా కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.