ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్… బీజేపీకి గుడ్ బై చెప్పారు. అందరికీ షాక్ ఇస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో ఆయనకు గులాబీ కండువా కప్పిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆరూరి రమేష్‌కు మాజీ మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులు పార్టీలో స్వాగతించారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. చిన్నప్పుడు ఎవరైనా పిల్లవాడు ఇల్లు తప్పిపోయి తిరిగి వస్తే తల్లిదండ్రులు ఎంత సంబరపడతారో.. నేడు ఇక్కడున్న పెద్దలు కూడా నన్ను చూసి అంతే సంబరపడుతున్నారని వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరంగల్ జిల్లాలో అనేక మంది మీద బురదజల్లి, వారిని రాజకీయంగా ఎదగకుండా చేశారని మండిపడ్డారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాఖాత్ అయి వరంగల్ జిల్లాలో అనేక మంది ఓటమికి కారణమయ్యారని ఆరోపించారు. అప్పటి పరిస్థితులతోనే తాను పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. కడియం శ్రీహరి పార్టీ వీడడంతోనే తాను సొంత ఇంటికి రావాలని నిర్ణయం తీసుకున్నానని ఆరూరి రమేష్ పేర్కొన్నారు.