ముద్ర, తెలంగాణ బ్యూరో : మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్ అంబర్‌పేటలో ఉన్న ఆ మహనీయుడి విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ , పలువురు ప్రజాప్రతినిధులు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులు పాల్గొని, మహనీయుడు పూలేకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం కంటే ముందు ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కలిసి మహాత్మా జ్యోతిబా పూలే గారి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి నెక్లెస్ రోడ్డు మార్గం, ఐమాక్స్ సమీపంలో స్థలాన్ని పరిశీలించారు. స్థలాన్ని పూర్తిస్థాయిలో సర్వే చేసి విగ్రహ ఏర్పాటుకు అవసమైన ప్రణాళికను అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.