చిన్న పిల్లాడి నుంచి వృద్ధుల వరకు ప్రభుత్వం తరపున అన్ని సేవలు
ముద్ర, నారాయణపేట:
సంక్షేమ పథకాల కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. మద్దూరు మండలం దూరేపల్లి గ్రామ సభలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్ది చేకూరుస్తామని, ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీ పథకాలకు ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చిన్న పిల్లాడి నుంచి వృద్ధుల వరకు ప్రభుత్వం అన్ని సేవలను అందిస్తోందన్నారు. భూభారతి పోర్టల్ తో భూ వివాదాలు తగ్గుతున్నాయన్నారు. జిల్లాలో ఒక్కటే రెవెన్యూ డివిజన్ ఉందని,రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్థామన్నారు. అలాగే మద్దూరు మండలం కడ కింద ఉందని, ఈ మండలంలోని ప్రతీ గ్రామానికి రెండు హైమాస్ట్ లైట్లను ఇవ్వడం జరిగిందన్నారు. ఏప్రిల్ నుంచి మళ్ళీ కొత్త ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని ఆయన చెప్పారు. 18 సంవత్సరాలు దాటిన మహిళలందరూ సంఘాల్లో చేరాలని, అలాగే 15 నుంచి18 సంవత్సరాల వయసు కలిగిన బాలికలు కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరి అని, కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలు ఆధార్ తోనే ముడిపడి ఉన్నాయన్నారు. త్వరలో ప్రారంభమయ్యే ఎస్ ఐ ఆర్ ప్రక్రియ కు ఆధార్ అవసరం అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు మరో రెండు పథకాలను ప్రారంభించనుందని కలెక్టర్ వెల్లడించారు. జూన్ 2 నుంచి ప్రారంభించే ఇందిరమ్మ జీవిత బీమా పథకం, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు అల్పాహార కార్యక్రమంతో పాటు, పాలు, రాగి జావా అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించాలని అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ విస్తృతంగా ప్రచారం జరిగేలా చూడాలని అన్నారు. జిల్లాలోని ప్రజలందరూ గ్రామ సభలకు హాజరై తమ అభిప్రాయాలు, సమస్యలను వెల్లడించి, గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. జిల్లాలో పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయడం జరుగుతుందని, ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు. అయితే రోడ్డు విస్తరణలో భాగంగా గ్రామంలో కొంతమంది ఇండ్లు కోల్పోతున్నారని, వారికి కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని బాధితులు కలెక్టర్ ను కోరారు.