. హస్తం పార్టీ వైపు మొగ్గు చూపిన మున్సిపల్ పరిధిలోని ఓటర్లు
ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ పోరులో ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగానే జరిగినట్లు తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా విజయావకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 36 వార్డులకు గాను సగానికి పైగా స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ నుండి బి ఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా ప్రచార పర్వం కొనసాగింది. అత్యధిక ఓటర్లు మాత్రం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుచూపినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
సోషల్ మీడియాలో ఈ రకంగా సంకేతాలు కనిపిస్తున్నాయి. మున్సిపల్ చైర్ పర్సన్ స్థానానికి మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన
ఇద్దరూ హేమా హేమీల మధ్య పోటీ ఉంది.

నేనంటే నేనే అన్న చందంగా వారి పలుకుబడిని బట్టి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వారే మున్సిపల్ పరిధిలోని 27వ వార్డు నుండి పోటీ పడిన
పెద్దెముల్ మండలానికి చెందిన మాజీ జడ్పిటిసి ఉప్పరి స్వరూప మల్లేశం వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి, ప్రతిపక్ష పార్టీలతో సైతం కలిసికట్టుగా ఉండే వ్యక్తి చైర్ పర్సన్ స్థానానికి ఎన్నిక చేస్తే పార్టీకి బాగుంటుందనే అభిప్రాయంతో కాంగ్రెస్ నాయకత్వం ఉందని, రాజకీయ విశ్లేషకుల భావన . ఆ కోణంలో చూస్తే ఉప్పరి స్వరూప మల్లేశం వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు 12వ వార్డుకు చెందిన నీరజ బాల్ రెడ్డి కూడా ఛైర్పర్సన్ రేసులో ఉంది.
మాజీ మున్సిపల్ కౌన్సిలర్ గా రెండు సార్లు పని చేయడం ఈమెకు కలిసి వచ్చే అంశంగా ఉంది. దీంతో ఈమె
సైతం తనదైన శైలిలో ఛైర్పర్సన్ స్థానానికి తనకున్న పలుకుబడితో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా. తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్థానానికి పోటీపడుతున్న ఈ ఇద్దరు నేతలకు కూడా కాంగ్రెస్ పార్టీలో మంచి పలుకుబడి ఉన్న నేతలే కావడం గమనార్షం. పార్టీ అధిష్టానం ఎవరికీ చైర్మన్ పదవి కట్టబెట్టిన అందరు కౌన్సిలర్లు కూడా వీరి ఇరువురి నాయకత్వాన్ని అంగీకరించే అవకాశం ఉంది. . ఏది ఏమైనా 16న జరిగే చైర్ పర్సన్ ఎన్నిక వరకు వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.