మహదేవపూర్, ముద్ర: కాటారం మండలంలోని స్వగ్రామమైన ధన్వాడలో దత్తాత్రేయస్వామి ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. పలు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరాగా అంగరంగ వైభవంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో మంత్రి మాతృమూర్తి శ్రీమతి జయమ్మ, సోదరుడు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ డ్యూటీలో శ్రీను బాబు దంపతులు పాల్గొన్నారు.ముందుగా మంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు. అనంతరం కళ్యాణ మహోత్సవంలో దుద్ధిల్ల శ్రీను బాబు దంపతులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి కళ్యాణం వైభవంగా సాగింది. మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరిపై శ్రీ సీతారాముల కృపాకటాక్షాలు ఉండాలని రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని శ్రీ సీతారాముల స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ధన్వాడ గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
