Take a fresh look at your lifestyle.

పేట జిల్లా కలెక్టర్ గా ప్రతీక్ జైన్ బాధ్యతలు నూతన కలెక్టర్ ముందు సవాళ్లు ఎన్నో…?అడ్మినిస్ట్రేషన్ గాడిలో పడేనా…?

 

ప్రజావాణి ఫిర్యాదులకు పరిష్కారం మార్గం దొరికేనా…?

నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ఎంత మేరకు పూర్తయేనో…!

ముద్ర, నారాయణపేట:

నారాయణపేట జిల్లా కలెక్టర్‌గా సుదీర్ఘకాలం పని చేసిన సిక్తా పట్నాయక్ బదిలీ కాగ ఆమె స్థానంలో వికార్‌బాద్ జిల్లా కలెక్టర్‌గా పని చేసిన ప్రతీక్ జైన్‌ను నారాయణపేటకు అలాట్ చేయగా సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

NarayanaPet District Collector Prateek Jain

ముందుగా అడిషనల్ కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలెక్టర్ కు స్వాగతం పలికారు. నారాయణపేట కలెక్టర్‌గా పనిచేసిన ప్రతీక్ జైన్ 2017 బ్యాచ్ ఐఏఎస్ కేడర్‌కు చెందినవారు. ఆయన గతంలో భద్రాచలం ఐటిడిఏ (ITDA) ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేశారు. అయితే నారాయణపేట జిల్లా నూతన కలెక్టర్ ముందు ప్రధానమైన సమస్యలు ఎన్నో ఉన్నాయి. అందులో మొదటగా జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా కొరవడింది. అధికారుల్లో పారదర్శకత పూర్తిగా లోపించింది. జిల్లాలో పలు శాఖలకు చెందిన అధికారులు సుదీర్ఘకాలం ఇక్కడే పనిచేస్తుండడంతో పారదర్శకమైన ప్రభుత్వ సేవలు అందించే విషయంలో నిర్లక్ష్యం అవుతుంది. చాలామంది జిల్లా అధికారులు ఇప్పటికీ మహబూబ్నగర్ హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి రోజువారి విధులకు హాజరు కావడం విశేషం. గతంలో పనిచేసిన కలెక్టర్ కూడా అధికారులు స్థానికంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన ఫలితం కనిపించడం లేదు. అంతేకాక కలెక్టరేట్ ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు తప్ప ఫిర్యాదుల పట్ల పూర్తిస్థాయిలో పరిష్కార మార్గం కనిపించడం లేదు. ఫిర్యాదుదారులు పదేపదే కలెక్టరేట్ ప్రజావాణికి రావడం ఫిర్యాదును ఎండాస్ చేయడం తప్ప ప్రజావాణి ఫిర్యాదుకు మాత్రం మోక్షం లభించడం లేదు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు అమలుతోపాటు ఆయా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల ఫీల్డ్ విజిట్, కలెక్టరేట్ మీటింగ్ ఇతర అంశాల విషయాలను ప్రత్యేక రికార్డు ఏర్పాటు చేయించి వివరాలు నమోదు చేయించి కాగిత రహిత సేవలను తీసుకువస్తే అధికారుల పనితీరులో పారదర్శకమైన సేవలు అందే అవకాశాలు ఉంటాయి. ఇక నారాయణపేట జిల్లా సరిహద్దు ప్రాంతం కావడంతో పక్క రాష్ట్రం నుంచి అక్రమ రవాణా జరగకుండా మరింత పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చివరకు నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నూతన జిల్లా కలెక్టర్ అడ్మినిస్ట్రేషన్ టైం లో ఈ ప్రాజెక్టును ఎంత మేరకు పూర్తి చేస్తారో వేచి చూడాల్సిందే మరి.

Leave A Reply

Your email address will not be published.