ముద్ర, హైదరాబాద్ :
సోషల్ మీడియా- మంచీ- చెడూ’ ( సోషల్ మీడియా- ఇంపాక్ట్- పాజిటివ్ అండ్ నెగెటివ్ ) అనే అంశంపై తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే), మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్, ఇండియా ( మెఫి) ఆదివారం హైదరాబాదులో ఒక జాతీయ సదస్సును నిర్వహిస్తున్నాయి. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లోని సురవరం ప్రతాపరెడ్డి ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కే విరాహత్ అలీ, మెఫీ మేనేజింగ్ ట్రస్టీ దేవులపల్లి అమర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల 27-29 తేదీలలో విజయవాడలో జరుగనున్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ)11వ ప్లీనరీ సందర్భంగా ఈ జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. న్యూఢిల్లీ కి చెందిన ప్రముఖ వెబ్ సైట్ ‘ది వైర్’ వ్యవస్థాపక సంపాదకుడు ఎంకే వేణు ముఖ్యఅతిథిగా పాల్గొని కీలకోపన్యాసం చేస్తారు. సీనియర్ జర్నలిస్ట్ ములుగు సోమశేఖర్ అధ్యక్షత వహిస్తారు. సోషల్ మీడియా తీరు, దాని ప్రభావం పై భిన్నమైన భావాలు వ్యక్తం అవుతున్న ప్రస్తుత సమయంలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.