Take a fresh look at your lifestyle.

ప్రజావాణితో పదేళ్ల బాలుడికి పునర్జన్మ

  • కాలేయ మార్పిడికి రూ. 10.50 లక్షలు మంజూరు
  • దినసరి కూలీ కుటుంబానికి అండగా నిలిచిన ప్రజావాణి

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాలేయ వ్యాధితో బాధపడుతోన్న పదేళ్ళ బాలుడికి శస్త్ర చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.10.50 లక్షల నిధులను ప్రభుత్వం మంజారు చేసింది. ఈమేరకు మంగళవారం ప్రజాభవన్ లో జరిగిన ప్రజావాణిలో కార్యక్రమంలో బాధిత బాలుడు విశాల్ తల్లిదండ్రులు శంకర్ , సరితలకు సీఎం రేవంత్ రెడ్డి తరపున ఉచితంగా కాలేయ మార్పిడి చేసే ఉత్తర్వులను ఇన్ చార్జ్ డాక్టర్ జి. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య అందజేశారు. ఖమ్మం జిల్లా పోలేపల్లి గ్రామానికి చెందిన శంకర్ కుటుంబం గత కొన్నేళ్ళుగా బొరబండ ప్రాంతంలో నివాసం ఉంటుంది. వారి కుమారుడు విశాల్ బాధపడుతుండంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్టుగా ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు.

కాలేయ మార్పిడి చేయించడానికి ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆ బాలుడి తల్లిదండ్రులు శంకర్, సరిత ప్రజావాణిలో తమ దీనగాథను డాక్టర్ జి చిన్నారెడ్డి స్టేట్ మోడల్ అధికారి దివ్యలకు విన్నవించారు. వారి సూచనల మేరకు ఆరోగ్యశ్రీ అధికారులు స్పందించి బాలుడు విశాల్ కు కాలేయ మార్పిడి కోసం పది లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేస్తూ.. ఉచితంగా కాలేయ మార్పిడికి ఏర్పాట్లు చేశారు. నిమ్స్ లోని జీవన్‌దార్ ట్రస్టులో బాలుడు విశాల్ పేరు నమోదు చేయించారు. అతి త్వరలో ఆ బాలుడికి కాలేయ మార్పిడి చేసేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా తమ బాలుడికి పునర్జన్మ లభించిందని విశాల్ తల్లిదండ్రులు శంకర్ సరిత సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ బాలుడు విశాల్ కు పునర్జన్మ ప్రసాదించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ప్రజావాణి ఇన్చార్జి చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ లకు శంకర్, సరిత ధన్యవాదాలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.