- ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో శాఖా పరమైన విచారణ జరుగుతోంది
- విచారణ సంస్థల ముందుకు వచ్చి ఎవరైనా అభిప్రాయాలు చెప్పవచ్చు
- విద్యారంగాభివృద్ధికి పెద్దపీట వేశాం
- కేంద్రంతో బలమైన సంబంధాలు కోరుకుంటున్నాం
- విధానపరమైన అంశాలపైనే పోరాటం ఉంటుంది
- రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు,విద్యా,ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
- చెన్నైలో విద్య సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోన్న కేటీఆర్ పై కేసు నమోదు కావడం పాలనలో భాగమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇందులో రాజకీయ, అధికార పార్టీగా తాము చేసింది ఏమీ లేదన్నారు. ఈ కార్ రేసింగ్ లో ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపణలు వచ్చాయన్నారు. అందుకే అప్పటి మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసి శాఖ పరమైన విచారణ చేస్తున్నట్లు వివరించారఉ. మంగళవారం చెన్నైలో ఓ ప్రముఖ సంస్థ విద్యా రంగంపై నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరై పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ కార్ రేస్ కేసు విషయంలో ఎవరైనా విచారణ సంస్థల ముందుకు వచ్చి వారి అభిప్రాయాలను తెలియజేయవచ్చన్నారు.
రాష్ట్రంలో గురుకుల విద్యా వ్యవస్థ సుదీర్ఘ కాలంగా కొనసాగుతుందని చెప్పిన భట్టి.. తెలంగాణ విద్యార్థులు గ్లోబలైజేషన్ తో ప్రపంచంతో పోటీపడేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యచరణ రూపొందిస్తున్నారు. అందులో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. కులం, మతం, ప్రాంతం భేదం లేకుండా ఈ పాఠశాలలో అడ్మిషన్లు ఇస్తామన్నారు. 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రెండు వందల కోట్ల వ్యయంతో ఒక్కో పాఠశాలను నిర్మిస్తున్నామన్నారు. టీచింగ్ స్టాఫ్ మొత్తం పాఠశాలలో ఉండే లా వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని క్రికెట్, ఫుట్బాల్ భారీ క్రీడా మైదానాలు ఈ పాఠశాలలో ఉంటాయని తెలిపారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఏదో కోల్పోయామనే ఆవేదన చెందొద్దనే ఆలోచనతో ప్రతి 15 రోజులకు ఒకసారి సినిమా ప్రదర్శించేందుకు థియేటర్ను కూడా నిర్మిస్తున్నామని తెలిపారు.
బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్, బెస్ట్ డైట్ ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తామని తెలిపారు. విద్యపై పెట్టుబడితో గొప్ప మానవ వనరులను ఉత్పత్తి చేయవచ్చనీ తద్వారా రాష్ట్రానికి సంపద చేకూరుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. తమ ప్రభుత్వం విద్యారంగానికి ఈ ఆర్థిక సంవత్సరం రూ. 21 వేల కోట్లు కేటాయించిందన్నారు. రాబోయే రోజుల్లో నిధులు పెంచాలని నిర్ణయించామన్నారు. 60 యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి రూ. 5 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. గత పదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ విద్యా వ్యవస్థను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి రాగానే హాస్టల్ విద్యార్థుల డైట్ కాస్మోటిక్ ఛార్జీల పరిస్థితిపై సమీక్షించి 40 శాతం డైట్ చార్జీలు, 25శాతంకాస్మోటిక్ ఛార్జీలు పెంచామన్నారు. సీనియర్ అధికారులు హాస్టళ్లను విసిట్ చేయాలని, అక్కడే ఒక రాత్రి బస చేయాలని, మహిళా అధికారులు విద్యార్థినిల వసతి గృహాల్లో వస చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. మంత్రులు కూడా సదుద్దేశంతో హాస్టలను విజిట్ చేస్తున్నామని తెలిపారు.
విద్యతో పాటు ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు భట్టి తెలిపారు. కొత్తగా డీఎస్సీ నిర్వహించి 6వేల టీచర్లను నియమించామన్నారు. 35 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు నిర్వహించామని తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు వివరించారు. ఇప్పటికే 56వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం అని వివరించారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నాయి దీనిపై సమగ్ర విచారణకు, అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ కమిషన్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. అలాగే రాష్ట్రంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు,విద్యా,ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భట్టి వివరించారు.