బీసీ వర్గాలు ఐక్యతతో ముందుకు సాగాలి.
మార్గదర్శకులు మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :
రాష్ట్రంలోని బీసీ వర్గాలు తమ అభ్యున్నతి కోసం ఐక్యతతో ముందుకు సాగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. బీసీల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం చేపడుతోన్న కార్యక్రమాలకు అండగా నిలవాలన్నారు. ఈ నెల 11న ట్యాంక్ బండ్ ఐమాక్స్ థియేటర్ ఎదురుగా లేక్ వ్యూ పార్క్ వద్ద మహాత్మా జ్యోతిబాపూలే,సావిత్రి బాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించుకోనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అక్కడ కొనసాగుతోన్న నిర్మాణ పురోగతి పనులను మంత్రి కొండా సురేఖ, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, బీసీ సంఘాల సభ్యులతో కలిసి మంత్రి మంగళవారం పరిశీలించారు. అనంతరం ప్రారంభ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలేలు మార్గదర్శకులుగా నిలుస్తారని మంత్రి అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే అందించిన మహనీయ సేవలు వెలకట్టలేమని చెప్పారు. అధికారులు పనులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులను వేగవంతంగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్దేశించిన విధంగా పనులను రెండు రోజుల ముందే పనులు పూర్తి ప్రారంభానికి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే అతిధులకు సభ ప్రాంగణంలో ఎవరికి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ,బీ,సీ మైనార్టీ ల ఆశీర్వాదంతో ప్రజా పాలన ప్రభుత్వం వచ్చిందన్న ఆయన ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ గా మార్చుకున్నామని తెలిపారు. జ్యోతిబాపులే సామాజిక న్యాయం కోసం ఎన్నో పోరాటాలు చేశారని , సావిత్రి బాయి పూలే ప్రతి మహిళ చదువుకోవడం కోసం ఉద్యమించారని గుర్తు చేశారు. ఖైరతాబాద్ సర్కిల్లో దాదాపు రూ. 4 కోట్లతో మహాత్మాజ్యోతిబాలే, సావిత్రి బాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని అన్నారు. విగ్రహాలు చూడగానే వారి జీవిత చరిత్ర ప్రజల్లో వారు అందించిన సేవలు, సంస్కరణలు ఆలోచింపజేసేల విగ్రహాలు పెట్టుకుంటామన్నారు. మహిళలు చదువుకోవాలని సావిత్రి బాయి పూలే కృషి ఎంతో గొప్పదని తెలిపారు. వెనుకబడిన వర్గాల సామాజిక న్యాయం కోసం మహాత్మా జ్యోతిబా పూలే ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. . 11న ఉదయం మీ గ్రామాల్లో జ్యోతి బాపూలే కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని సాయంత్రం సభ కార్యక్రమాన్ని విచ్చేసి విజయవంతం చేయాలని సూచించారు. జ్యోతి బాపులే సావిత్రి బాయి పూలే విగ్రహాలకు ఒక పక్కన ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, మరో పక్కన మహనీయుడు బి ఆర్ అంబేద్కర్, ఇటువైపు ఆర్థిక సంస్కరణల నిపుణులు పీవీ నరసింహారావు గారి విగ్రహాలు ఉన్నాయి.. మహనీయులు ఉన్న ఈ ప్రాంతం నేటితరానికి వారి జీవిత చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అలాగే ఈ మార్గానికి పూలే మార్గ్ గా పెట్టాలని స్థానిక శాసన సభ్యులు దానం నాగేందర్ సూచించారన్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ జిల్లా వాళ్ళు సమన్వయం తో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి కొండా సురేఖా మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సామాజిక సంస్కర్త, విద్యా ప్రాధాన్యతను ముందుకు తెచ్చి నడిపించారని అన్నారు. అలాగే కుల వివక్షను ఎదుర్కొని సమానత్వం కోసం ఎంతో పోరాడారని అన్నారు. మహిళల విద్య ప్రోత్సాహన, బాల్య వివాహాల నిరోధంలో జ్యోతిబా పూలే, సావిత్రిబాయ్ పూలే కీలక పాత్ర పోషించారని తెలిపారు. ‘గులాం గిరి’ వంటి రచనల ద్వారా సామాజిక దోపిడీపై పోరాటంతో పాటు బలహీన వర్గాల చైతన్యం పరచటంలో తమ విశ్వసనీయత చాటుకున్నారని చెప్పారు. అలాంటి మహానుభావుల విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు.