ముద్ర ప్రతినిధి, నిర్మల్:
అంతర్జాతీయ సంస్థ సిమెన్స్ ఇండియా నిర్వహించే ప్రతిష్టాత్మక స్కాలర్‌షిప్ కార్యక్రమానికి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ స్కాలర్‌షిప్ యువ ఇంజనీర్ల వృత్తిపర అభివృద్ధికి తోడ్పడు తుంది. ప్రతిభావంతులైన యువ ఇంజినీర్లను ప్రోత్సహించడం, వారిని భవిష్యత్ సాంకేతిక నాయకులుగా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ స్కాలర్‌షిప్ ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు, నిపుణులైన మెంటర్‌షిప్, ఆధునిక టెక్నికల్ ట్రైనింగ్, ప్రముఖ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభిస్తాయి. ఇది వారి కెరీర్ వృద్ధికి కీలకమని భావిస్తున్నారు. ఈ మేరకు ఎంపికైన విద్యార్థులను విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ గోవర్ధన్, ఓఎస్డి ప్రొఫెసర్ మురళీ దర్శన్ అభినందించారు. ఈ అవకాశం వారి భవిష్యత్తుకు, దేశ సాంకేతిక పురోగతికి దోహదపడుతుందని వారు పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియలో సహకరించిన యూనివర్సిటీ యాజమాన్యానికి, అధికారులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.