Take a fresh look at your lifestyle.

రేవంత్​.. ఇక కాచుకో..! నేను కొడితే మామూలుగా ఉండదు 

  • గట్టిగా కొట్టడమే నాకు అలవాటు 
  • గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా
  • బరిలోకి దిగితే ఇక దబిడిదిబిడే 
  • హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలం
  • ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి
  • ఇక నుంచి మనం బరిలోకి దిగుతున్నాం
  • ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభ
  • మాజీ సీఎం కేసీఆర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :- రేవంత్…ఇక కాచుకో..! రంగంలోకి దిగుతున్నా….ఇక మీకు…కాంగ్రెస్ ప్రభుత్వానికి దబిడి దిబిడేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ఇన్నాళ్లు గంభీరంగా…మౌనంగా ప్రభుత్వాన్ని చూస్తూ వస్తున్నానని అన్నారు. ఇక కాంగ్రెస పై దండయాత్ర చేయబోతున్నానని అన్నారు. నేను కొడితే మాములుగా ఉండగా….గట్టిగా కొట్టడమే నాకు అలవాటు అని రేవంత్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయినా…. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వివిధ వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం గతంలో ఎన్నో సంక్షేమ పథకాలను సమర్ఖవంతంగా అమలు చేసి చూపించిందన్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం వాటిల్లో ఏ ఒక్క పథకాన్ని  కూడా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు.
ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు తీవ్ర అసంతృప్తితో రగిలి పోతున్నారన్నారు.  బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు ఎంతో సంతోషంగా జీవనం సాగించారన్నారు. కానీ అసమ్థ ముఖ్యమంత్రికి పాలన చేతకాక బంగారు తెలంగాణను బజారు కీడిస్తున్నారని కేసీఆర్  వ్యాఖ్యానించారు.  ఇలాంటి అసమర్థ పాలనకు చరమగీతం పాడాలనే ఉద్దేశ్యంతోనే మళ్లీ  ప్రజలకు అండగా ఉండేందుకు తాను మళ్లీ  ప్రజాక్షేత్రంలోకి వస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఉదృతంగా ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ  బీఆర్ఎస్ అని…రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరిగే వరకు బిఆర్ ఎస్ పార్టీ రక్షణ కవచంలా నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ శక్తి ఏందో చూపెట్టడానికి ఫిబ్రవరి నెలలో బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనను సమీక్షిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం జరాసంగం మండలం మేదపల్లి గ్రామం నుండి వందలాది మంది ఉద్యమ కారులు, బి ఆర్ ఎస్ నాయకులు , అభిమానులు కేసీఆర్ కలవడానికి గత ఐదు రోజులుగా 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శుక్రవారం ఎర్రవెల్లి లోని  ఆయన నివాసానికి చేరుకున్నారు . ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశానికి  కేసీఆర్ హాజరై ప్రసంగించారు . కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 14 నెలలు ఓపిక పట్టామని , వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు పాలనతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ళ పాటు ఉద్యమాలు చేసి పోరాడితే తెలంగాణ వచ్చిందన్నారు. వచ్చిన తెలంగాణను పదేళ్లలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఎంతో కష్టపడి అన్ని రంగాలను అభివృద్ధి చేసి ఒక గాడిలో పెట్టిందని గుర్తు చేశారు .  గులాబీ హయాంలో దేశంలోనే అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపితే … కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనలో తెలంగాణను నాశనం చేస్తూ ప్రజలను అరిగోస పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలను కంటికి రెప్పలా చూశాం
తెలంగాణ వచ్చిన ఆరేడు నెలల్లోనే గులాబీ ప్రభుత్వం ప్రజలకు 24 గంటల కరెంటు సరఫరా చేసిందన్నారు. పెద్ద పెద్ద సిపాయిల్లాగా భావించే కాంగ్రెస్ వాళ్ళు గతంలో ఆ పని ఎందుకు చేయలేకపోయారని కేసీఆర్ ప్రశ్నించారు . “ప్రాజెక్టుల ద్వారా సాగు నీళ్లు ,  మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగు నీళ్లు ఇచ్చామన్నారు . నీటి తీరువా రద్దు చేశామన్నారు. చెరువులు బాగు చేశామన్నారు. మల్లన్న సాగర్ వంటి ఎన్నో రిజర్వాయర్లు నిర్మించామని తెలిపారు. ఇక రైతు బీమా వంటి పథకాన్ని ప్రవేశపెట్టి  ఒక గుంట భూమి రైతు చనిపోయినా అతని కుటుంబాన్ని ఆదుకున్నామన్నారు.  రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ మనోళ్లే అని అనేక సంక్షేమ పథకాలతో….. కంటికి రెప్పలా చూసుకున్నామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో  అన్నీ పోయాయని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం మళ్ళీ మొదటికి వచ్చిందన్నారు. వాళ్ళు ఇప్పుడు అన్ని రంగాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదాయాన్ని పెంచాం
బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏటా పదిహేను వేల కోట్ల ఆదాయం పెరిగేదని గుర్తు చేశారు . ఇప్పుడు పదమూడు వేల కోట్ల ఆదాయం తగ్గిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్ ) నివేదిక వెల్లడించిందన్నారు . ఇంకా కొంత కాలం గడిస్తే రాష్ట్రం తీవ్ర ఆర్ధిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని ఆర్ధిక నిపుణులు  పేర్కొంటున్నారన్నారు. చివరకురిటైర్ మెంట్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు బెనిఫిట్స్ కూడా సరిగా ఇస్తలేదని కేసీఆర్ మండిపడ్డారు. ” అన్ని వర్గాల పేద పిల్లల కోసం గురుకులాలు ఏర్పాటు చేస్తే వాటి నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసిందన్నారు . ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ ముస్లిం ల ఓట్లు వేయించుకుంది కానీ వాళ్ళ బాగోగులను గుర్తించలేదన్నారు . ఇమామ్ లు మౌజం లకు కనీసం వేతనాలు ఇవ్వాలనే ఆలోచన కూడా కాంగ్రెస్ వాళ్లకు రాలేదన్నారు. మళ్ళీ పాత కాంగ్రెస్ మోపైంది . కరెంటు కోతలు మొదలయ్యాయని అన్నారు. మంచి నీళ్లు వస్తలే… ఇట్లనే ఉంటదా రాజ్యం ” అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు . గోదావరి నుంచి నీళ్లు తెచ్చుకున్నం , మంచి నీళ్లు తెచ్చుకున్నం . జహీరాబాద్ నియోజక వర్గంలో సంగమేశ్వర , బసవేశ్వర లిఫ్టులను బి ఆర్ ఎస్ ప్రభుత్వం మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పనులు ఆపి రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నదని  ప్రశ్నించారు. రైతులకు నష్టం జరుగుతుంటే ఆ జిల్లా మంత్రి ఏం చేస్తున్నడని నిలదీశారు. రైతులను భారీ స్థాయిలో సమీకరించి ఉద్యమం చేపట్టాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావుకు కేసీఆర్ సూచించారు .
కాంగ్రెస్ ను క్షమించేది లేదు
“తెలంగాణ సాధించిందే గులాబీ జెండా . ప్రభుత్వంలో ఉండి దేశంలో ఎవరూ చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది బీ ఆర్ ఎస్ ప్రభుత్వమన్నారు. ఇక ప్రజల సమస్యల విషయంలో నిర్లక్ష్యం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షమించేది లేదన్నారు . ఇటీవల కాంగ్రెస్ పార్టీ వాళ్ళే సర్వే చేస్తే పోలింగ్ లో 75శాతం మంది  బీఆర్ ఎస్ పాలనే బాగుందని అన్నారని గుర్తు చేశారు . అందరూ కేసీఆర్ నే యాది చేస్తున్నారని మైనార్టీ సోదరులు కూడా చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో భూముల ధరలు పడిపోతున్నాయన్నారు . గులాబీ హయాంలో మారుమూల ప్రాంతంలో కూడా ఎకరానికి 40-50 లక్షలు విలువ ఉండే అని కేసీఆర్ గుర్తు చేశారు. ఇట్లనే వదిలేస్తే ఇంకా ఆగం చేస్తారన్నారు. వీళ్ళ మెడలు వంచాల్సిందే . ప్రజా పోరాటాల్లో తాను కూడా పాల్గొంటా నిని కేసీఆర్ పేర్కొన్నారు .
జహీరాబాద్ నుండి 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసి వచ్చిన పార్టీ నాయకులు , అభిమానులు పాదయాత్ర చేసి ఎర్రవెల్లి కి వచ్చారంటే బి ఆర్ ఎస్ పార్టీ తెలంగాణలో ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవచ్చునని అన్నారు . ఇలాంటి బిడ్డలే తెలంగాణ జాతిరత్నాలు…..బి ఆర్ ఎస్ కు పట్టుగొమ్మలు . మీ కష్టం వృధాపోదన్నారు . మళ్ళీ తెలంగాణలో వచ్చేది బి ఆర్ ఎస్ ప్రభుత్వమేనని, ఈ విజయం కేవలం పార్టీ విజయం కాదన్నారు. బీఆర్ ఎస్ విజయం  తెలంగాణ రైతుల విజయం , తెలంగాణ పేద ప్రజల  విజయమని అన్నారు.
ఈ సందర్భంగా పాదయాత్ర నిర్వహించిన మాజీ సర్పంచులు పరమేశ్వర్ పాటిల్ , బోయిని చంద్రయ్య , బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సంగమేశ్వర్ నాయకులు ప్రశాంత్ , బోయిని శ్రీనివాస్ , ప్రదీప్ తదితరులు బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ గారిని శాలువాతో సత్కరించి కేతికి సంగమేశ్వర స్వామి ఆలయ ప్రసాదం అందజేశారు . కేసీఆర్ ను చూడాలని , వారిని కలవాలని , వారితో మాట్లాడాలని 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పార్టీ నాయకులు , అభిమానులు రావడం అభినందనీయమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాణిక్ రావు , సునీతా లక్ష్మారెడ్డి , చింతా ప్రభాకర్ , మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి , డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.