- 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి
- క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో సీఎం చర్చలు
- కలిసి వచ్చిన సింగపూర్ టూర్
ముద్ర, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రైజింగ్టీమ్ సింగపూర్ పర్యటన మంచి ఫలితాలు వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. విదేశీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల వేట కొనసాగుతోంది. పెట్టుబడుల ద్వారా తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. మంచి ఫలితాలు రాబడుతోంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి టీమ్, సింగపూర్ పారిశ్రామికవేత్తలతో సమావేశాలు, ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది క్యాపిటల్యాండ్ సంస్థ. దాదాపు రూ.450 కోట్లను పెట్టుబడి పెట్టనుంది. ఈ గ్రూప్ నేతృత్వంలో ఒక మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఐటీ పార్క్ అభివృద్ధి చేయనుంది.

రూ. 450 కోట్ల పెట్టుబడి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లో రూ.450 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ముందుకొచ్చింది. సీఎం సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్‌లో మూడో రోజు పర్యటించింది. అందులో భాగంగా క్యాపిటల్ ల్యాండ్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సహా రాష్ట్ర బృందం సమావేశమైంది. అనంతరం పెట్టుబడులకు ముందుకొచ్చినట్లు క్యాపిటల్ ల్యాండ్ ప్రకటించింది. ఈ మేరకు సంస్థ హైదరాబాద్‌లో రూ.450 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దాంతో నగరంలో లక్ష చదరపు అడుగల విస్తీర్ణంలో ఐటీ పార్క్‌ను క్యాపిటల్ ల్యాండ్ నిర్మించనుంది. గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, బ్లూ-చిప్ కంపెనీల డిమాండ్‌కు అనుగుణంగా ఈ కొత్త ప్రాజెక్టును చేపట్టనుంది.

హైదరాబాద్‌లోని ప్రముఖ బిజినెస్ పార్కులైన ఇంటర్నేషనల్ టెక్ పార్క్ హైదరాబాద్, ఎవ్యాన్స్ హైదరాబాద్, సైబర్ పెరల్ వంటివి క్యాపిటల్ ల్యాండ్ నిర్మించినవే. సింగపూర్ కేంద్రంగా విస్తరించిన ఈ కంపెనీ ప్రపంచ స్థాయి రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటి. హైదరాబాద్ లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయనుంది. సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రెడ్డి, సీఎంవో స్పెషల్ సెక్రెటరీ అజిత్ రెడ్డి, క్యాపిటల్ ల్యాండ్ తరఫున ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ క్యాపిటల్ ల్యాండ్ చేపట్టే కొత్త ఐటీ పార్కు హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలు రాయిగా నిలుస్తుందని అభిప్రాయ పడ్డారు.. క్యాపిటల్ ల్యాండ్ నిర్ణయాన్నిస్వాగతించారు. బ్లూ చిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల కు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేలా అన్ని సౌకర్యాలను ఈ ఐటీ పార్కులో అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంగా గౌరీ శంకర్ నాగభూషణం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, తమ సంస్థ కార్యకలాపాలను తెలంగాణలో విస్తరించటం ఆనందంగా ఉందని అన్నారు.క్యాపిటల్ ల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్ లో అంతర్జాతీయ టెక్ పార్క్, అవాన్స్ హైదరాబాద్, సైబర్‌పెర్ల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలోనే అందుబాటులోకి వస్తుంది. ఐటీపీహెచ్ రెండో దశ ఈ ఏడాదిలో ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది.