Take a fresh look at your lifestyle.

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ రోడ్ నెట్‌వర్క్‌ ఆర్అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హ్యామ్ మోడల్ పద్ధతిలో అద్దం లాంటి రోడ్ల నిర్మాణం
రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే రీజినల్ రింగ్ రోడ్డుపై ఫోకస్
ఆర్అండ్ బీ వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష

ముద్ర, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రోడ్ నెట్‌వర్క్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తుందన్న ఆయన సరికొత్త ప్రతిపాదనలతో సిద్ధంగా ఉండాలని అదికారులను ఆదేశించారు. 2026-27 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలపై బుధవారం సచివాలయంలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది బడ్జెట్ ఎస్టిమేట్స్ అత్యంత స్పష్టమైన ప్రణాళికతో ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గత ఏడాది నిధుల వినియోగం, పనుల పురోగతిని సమీక్షించిన ఆయన.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాపై ఎటువంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే రీజినల్ రింగ్ రోడ్డు వంటి భారీ ప్రాజెక్టులపై ప్రధాన దృష్టి సారించాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ మోడల్ పద్ధతిలో అద్దం లాంటి రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత ముఖ్యమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని 8 లేన్లుగా విస్తరించే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని మంత్రి తెలిపారు. ఆ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం రెండున్నర గంటల్లోనే చేరుకోవచ్చు. పనులు వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని వ్యక్తిగతంగా కలిసి కోరతానని పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న పాలనాపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్న ఆయన అధికారులు కూడా మనసుపెట్టి పనిచేసి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, అనుమతుల కోసం త్వరలోనే ఢిల్లీ వెళ్లి సంబంధిత కేంద్ర మంత్రులను కలుస్తామన్నారు. ఈ సమీక్షలో ఆర్‌అండ్‌బి శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఈఎన్సీలు మోహన్ నాయక్, జయ భారతి, సీఈలు శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, వసంత్ నాయక్, బి.వి రావు, లింగారెడ్డి, నర్సింగ్ రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.