క్షేత్ర స్థాయిలోనూ బలంగా ఉన్నామని ‘స్థానిక’ఫలితాలు నిరూపించాయి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమే లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ పోరు మొదలు తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో హస్తం హవా కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలోనూ బలంగా ఉందని స్థానిక సంస్థల ఎన్నికలు నిరూపించాయని వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు 67శాతం బీసీ వార్డు మెంబర్లుగా గెలిచారని చెప్పారు. 87.5శాతం ఎస్సీ, ఎస్సీ, బీసీలకు కాంగ్రెస్ టికెట్లు ఇచ్చిందన్నారు. పుర పోరులో 94 మున్సిపాలిటీలను గెలిచామంటే అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రజలు సానుకూలతకు నిదర్శనం అన్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, స్ధానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ల మధ్య చెలరేగిన వివాదంపై మాట్లాడిన మహేశ్ కుమార్ గౌడ్… జీవన్ రెడ్డి పార్టీ సిద్ధాంతాలు, స్ధానిక పరిస్థితులు, రాష్ట్ర రాజకీయాలను అర్ధం చేసుకుని అర్థం చేసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. సీట్లు, మున్సిపల్ చైర్కెన్ కౌన్సిలర్ల ఆధారంగా అక్కడ ఎంపిక జరిగిందన్నారు. అలాగే మంత్రివర్గంపై పీసీసీ జోక్యం ఉండబోదని పార్టీ చీఫ్ స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే మంత్రులందరూ పని చేయాల్సి ఉంటుందన్నారు. లేదంటే అధిష్టానం ఏదైనా వివరణ కోరితేనే పీసీసీ స్పందిస్తుందన్నారు.