‘ఆంధ్ర’ నేతల పెత్తనాన్నే ద్వేషించాం
ఆంధ్ర ప్రజలంటే మాకు ద్వేషం లేదు
విడిపోయిన రాష్ట్రాలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలి
తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కోసం జనం ఎదురుచూస్తున్నారు
బీఆర్ఎస్, బీజేపీ లు ప్రతిపక్షాలుగా వైఫల్యం చెందాయి
త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నాం
అలిపిరిలో జాగృతి అధ్యక్షురాలు కవిత
ముద్ర, తిరుపతి :

ఆంధ్రా ప్రజలంటే ఏనాడూ తమకు ద్వేషం లేదనీ ఆంధ్రా రాజకీయ నాయకుల పెత్తనాన్ని మాత్రమే ద్వేషించామని జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. ఆంధ్ర ఆధిపత్యం, ఆంధ్రా రాజకీయ నాయకుల ఆధిపత్యాన్ని మాత్రమే మేము వ్యతిరేకించామన్న ఆమె రాజకీయ నాయకుల ఆధిపత్యంపై ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. ఆంధ్రా, తెలంగాణలో ఎవరు కూడా ప్రజలపై ఆధిపత్యం చెలాయించ వద్దని కోరారు. తెలంగాణ ప్రజలు అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకునే మానవతావాదులన్నారు. ఇప్పుడు తెలంగాణ, ఏపీ విడిపోయిన నేపథ్యంలో ఎవరి బాటన వారు అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఢిల్లీ లిీక్కర్ స్కాంలో అక్కడి రౌస్ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చిన నేపథ్యంలో గురువారం తిరుపతి చేరుకున్న ఆమె అలిపిరి నుంచి నడకమార్గంలో తిరుమల కొండపైకి చేరుకున్నారు. అంతకు ముందు ఆమె అక్కడి మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో లిక్కర్ కేసులో చేయని తప్పునకు నాలుగేళ్లుగా మానసిక వేదన అనుభవించానని తెలిపారు. దేవుడి దయ వల్ల కేసును కోర్టు పూర్తిగా కొట్టేసిందని పేర్కొన్నారు. కేసు నుంచి విముక్తి లభిస్తే కాలి నడకన తిరుమలకు వస్తానని మొక్కుకున్నాననీ అందుకే తిరుపతి వచ్చానని తెలిపారు. కాలినడక తిరుమల కొండకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నానని చెప్పారు. అమలుకు సాధ్యం కాని హామీలతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ వాటిని ఎన్నికల మెనిఫెస్టోను గాలికొదిలేసిందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ లు ప్రతిపక్షాలుగా వైఫల్యం చెందాయని చెప్పారు. ప్రత్యామ్నాయం లేకనే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వచ్చాయని చెప్పారు. దేవుడి ఆశీస్సులతో ఢిల్లీ లిక్కర్ కేసు కొట్టివేయబడిందన్న కవిత… తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు త్వరలోనే రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు వెల్లడించారు. తమ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా, బేధభావాలు లేకుండా మంచి చేసే పార్టీ పెడుతున్నామన్నారు. పార్టీ పెట్టిన తర్వాత కూడా కొత్త కార్యక్రమాలు చేపడతామనీ మళ్లీ స్వామి వారి ఆశీస్సుల కోసం తిరుమల వస్తామన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పుడు ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేసినా వారిని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. పూటకొక స్టాండ్ మార్చుకునే పార్టీలను ప్రజలు విశ్వసించరన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జాగృతి చాలా ఆలస్యంగా బరిలోకి దిగినప్పటికీ 40 స్థానాల్లో గెలిచిందన్నారు. రాజకీయ పార్టీ అంటే ఆ ప్రాంత ప్రయోజనాలు, ప్రజల మనోభావాలు, అస్తిత్వం, హక్కుల కోసం పనిచేయాలన్న కవిత.. తాము ఎన్నికలు ధ్యేయంగా కాకుండా తెలంగాణ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. తెలంగాణ ప్రాంత పరిరక్షణ, అస్తిత్వం, హక్కుల కోసం పోరాటానికే పార్టీ పెడుతున్నాం. ఆంధ్రా ప్రాంతంలో ఆదినారాయణ, ప్రతాప్, కిషోర్ యాదవ్ తదితరులు జాగృతి కి మద్దతు ఇస్తున్నారు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, మహిళలు, యూత్ ను బీఆర్ఎస్ పూర్తిగా విస్మరించిందని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ విస్మరించిన వర్గాల అజెండానే తాము ముందుకు తీసుకొని వెళ్తామని ప్రకటించారు. కొత్తదనంతో ముందుకు వెళ్తేనే కొత్త పార్టీలకు మనుగడ ఉంటుందని అభిప్రాయపడ్డారు. పెద్ద పెద్ద మాటలు చెప్పి ప్రజలకు క్షేత్ర స్థాయిలో సమస్యలు తీర్చకుండా ఉండే పార్టీ తమది కాదని కవిత అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ మైక్రో లెవల్ లో ప్రజల సమస్యలపై పోరాడుతామని స్పష్టం చేశారు. తిరుమలలో కల్తీ లడ్డు విషయంలో తెలంగాణ ప్రజల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి వారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉంటారన్న ఆమె టీటీడీ విషయంలో ప్రజలకు విశ్వసనీయత కలిగించేలా ఇక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. తాను సిరిసిల్ల నుంచి పోటీ చేస్తానని తన కుమారుడు అనలేదని కవిత వివరణ ఇచ్చారు. అనని మాటలను ప్రసారం చేయవద్దని మీడియాను కోరారు.
