మున్సిపల్ ఎన్నిక ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల సంఘం ప్రకటన
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో అమలులో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తవడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. ఎన్నికల ఫలితాలు వెలువడి, పాలకవర్గాల ఎన్నిక కూడా ముగియడంతో ఎన్నికల నియమావళి తక్షణమే రద్దవుతున్నట్లు ఎన్నికల అధికారులు మంగళవారం ప్రకటించారు. గత నెల 27న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమలులో ఉన్న సమయంలో కొత్త పథకాల ప్రకటనలు, బదిలీలు, ప్రభుత్వ ప్రచారాలపై ఆంక్షలు కొనసాగాయి. ఇప్పుడు కోడ్ ఎత్తివేయడం తో నిలిచిపోయిన అభివృద్ధి పనులు, పరిపాలనా పరమైన నిర్ణయాలు, బదిలీల ప్రక్రియ తిరిగి ప్రారంభం కానున్నాయి. మరోవైపు ఎన్నికల కోడ్ ముగియడంతో అటు అధికార యంత్రాంగం, ఇటు రాజకీయ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. నూతనంగా ఎన్నికైన మేయర్లు, చైర్మన్లు తమ తమ కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించి, అభివృద్ధి పనులపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా హంగ్ ఏర్పడి ఉత్కంఠ రేపిన మున్సిపాలిటీలలో కూడా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.