యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు
ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఈ నెల 18నుండి 28 వరకు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
మంగళవారం కలెక్టర్ తన చాంబర్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తో కలసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు నిర్వహించే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులకు కేటాయించిన పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.వి ఐ పి లను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.ప్రతి రోజు వివిధ ప్రాంతాల నుండి దేవాలయానికి ఎక్కువ మంది భక్తులు వస్తారని దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లను చేయాలని అధికారులకు ఆదేశించారు.ముఖ్యంగా ఈ నెల 24 న స్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం, 25 న స్వామి వారి కళ్యాణ మహోత్సవమునకు, 26 న స్వామి వారి దివ్య విమాన రథోత్సవ కార్యక్రమాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భద్రత ఏర్పాట్లు, భక్తులకు అవసరమైన సౌకర్యాలను పర్యవేక్షిస్తూ, ప్రోటోకాల్ ప్రకారంగా అన్ని ఏర్పాట్లు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాలని, ఆలయం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, క్యూలైన్లను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఆలయ పరిసరాల పరిశుభ్రత, శానిటేషన్, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా మున్సిపల్ అధికారులు ఏర్పాట్లుచేయాలన్నారు. పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ జరపాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగిన బందోబస్తు ఏర్పాటు, ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా,పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని పోలీసు శాఖకు సూచించారు. గుట్ట పైకి వెళ్ళే ఘాట్ రోడ్లలో చిన్న చిన్న గుంతలకు, కాళి నడకన నడిచే ఫుట్ పాత్ లు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. ఎమర్జెన్సీ సేవలను అందుబాటులో ఉంచాలని, గుట్ట పైన, బస్టాండ్ వద్ద మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు. సూదుర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ వారు అదనపు బస్సులు నడపడంతో పాటు పాత బస్టాండ్ నుండి గుట్ట పైకి షట్టల్ సర్వీసులు నడపాలన్నారు,రోడ్లపై పార్కింగ్ చేయకుండా చూడాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని టీమ్ ను ఏర్పాటు చేయాలన్నారు . ఫైర్ సేఫ్టీ అధికారులు గుట్ట పైన కింద వెహికల్స్ ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉండాలన్నారు. మంచినీటి కొరత లేకుండా నిరంతరం నీరు వచ్చేలా మిషన్ భగీరథ అధికారులు పర్యవేక్షణ జరపాలన్నారు. ఫిబ్రవరి 18 నుంచి 28 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తుల భాగస్వామ్యంతో గొప్పగా నిర్వహించేందుకు ప్రతి శాఖ సమన్వయంతో పని చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో భువనగిరి ఆర్డీఓలు కృష్ణారెడ్డి , సంబంధిత జిల్లా అధికారులు, పాల్గొన్నారు.