ముద్ర ప్రతినిధి :
తెలంగాణలో రబీ సీజన్‌లో ఈ ఏడాది సుమారు 148 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందులో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.
మంగళవారం హుజూర్‌నగర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరుగుతోందని పేర్కొన్నారు. గత ఖరీఫ్ సీజన్‌లో యావత్ దేశంలోనే అత్యధిక దిగుబడి తెలంగాణలో నమోదైందని ఆయన గుర్తుచేశారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేశామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8,251 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ధాన్యం నిల్వ, రవాణా కోసం 16 కోట్లకు పైగా గన్నీ సంచులు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.
రైతులకు మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. సన్న రకాల ధాన్యానికి క్వింటాలుకు రూ. 2,389తో పాటు రూ. 500 బోనస్ అందించనున్నట్లు, సాధారణ రకానికి రూ. 2,369 చెల్లించనున్నట్లు ఆయన వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లోనే చెల్లింపులు చేసేలా ప్రత్యేక వ్యవస్థను అమలు చేస్తున్నామని చెప్పారు.
అనధికార మార్గాల్లో ధాన్యం తరలింపును పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసినట్లు మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దుల వద్ద ధాన్యం ఎగుమతులు, దిగుమతులపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.
కస్టమ్ మిల్డ్ రైస్ (CMR) సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా మిల్లర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర ఆహార శాఖ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
గత ఖరీఫ్ సీజన్‌లో 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో రూ. 19,500 కోట్లకు పైగా నేరుగా జమ చేసినట్లు మంత్రి తెలిపారు. రాబోయే రబీ సీజన్‌లో మరింత సమర్థవంతంగా కొనుగోలు వ్యవస్థను అమలు చేసి కొత్త రికార్డు సాధించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాధికా అరుణ్ కుమార్ దేశముఖ్, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లికార్జున్, జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, ఎస్పీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.