నాగర్ కర్నూల్‌లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కీలక ముందడుగు ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను ప్రారంభించిన ఎమ్మెల్యే
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా ఒక ముఖ్యమైన చర్య చేపట్టారు. పట్టణంలోని శ్రీపురం చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను స్థానిక ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్, డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, ట్రాఫిక్ ఎస్‌ఐ కళ్యాణ్, టౌన్ ఎస్‌ఐ గోవర్ధన్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, రోజురోజుకు పెరుగుతున్న వాహన రాకపోకల నేపథ్యంలో ట్రాఫిక్ నియంత్రణకు ఆధునిక సిగ్నల్ వ్యవస్థ ఎంతో అవసరమని తెలిపారు. ప్రజల భద్రత, సౌకర్యం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని పేర్కొంటూ, భవిష్యత్తులో పట్టణంలోని మరిన్ని ముఖ్య కూడళ్ల వద్ద కూడా ఇలాంటి సిగ్నల్ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు, మునిసిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, టౌన్ ప్రెసిడెంట్ జక్కా రాజు, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ రెడ్డి, డీసీసీ కార్యదర్శి శ్రీనివాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, అధికారులు, పోలీసులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
కొత్తగా ప్రారంభించిన ట్రాఫిక్ సిగ్నల్స్‌తో నగరంలో ట్రాఫిక్ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.