ముద్ర ప్రతినిధి, కరీంనగర్:
ప్రజావాణి కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే బాధితులకు అధికారులు అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.

సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. బాధితులు వ్యక్తం చేసిన సమస్యలను ఓపికగా ఆలకించి, వెంటనే పరిష్కారం అయ్యే దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సమయం తీసుకునే అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే జిల్లా కలెక్టర్ స్వయంగా వెళ్లి వారి దరఖాస్తులను స్వీకరించి సమస్యలను తెలుసుకున్నారు. వాటిని పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. బాధితులు చెప్పిన సమస్యలను శ్రద్ధగా వినిపిస్తూ వారికి భరోసా కల్పించారు.
సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై మొత్తం 290 దరఖాస్తులు అందాయి. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని సరికొత్తగా నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, కరీంనగర్ ఆర్డీవో కె. మహేశ్వర్, హుజూరాబాద్ ఆర్డీవో రమేష్ బాబు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.