Take a fresh look at your lifestyle.

గురుకులాన్ని టాప్‌లో నిలబెట్టాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తిమ్మాపూర్ గురుకుల బాలికల పాఠశాల ఆకస్మిక తనిఖీ

ముద్ర ప్రతినిధి:
మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాన్ని అత్యుత్తమ విద్యా బోధనకు కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులకు సూచించారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధించేలా ప్రత్యేకంగా కృషి చేయాలని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు.

సోమవారం తిమ్మాపూర్‌లోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా తరగతి గదులను సందర్శించిన ఆమె విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి విద్యాబోధన, భోజన ఏర్పాట్లు, వసతులు వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం టిఫిన్, భోజనం అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం స్టాఫ్ రూమ్, వాష్‌రూమ్స్, వంటగది, స్టోర్ రూమ్, డార్మెటరీలను పరిశీలించారు. స్టోర్ రూమ్‌లో బియ్యం, పప్పులు తదితర సామగ్రిని తనిఖీ చేసి వాటి ఎక్స్‌పైరీ తేదీలను తరచూ పరిశీలించాలని అధికారులకు సూచించారు. గురుకులంలో మోడ్రన్ కిచెన్ ఆధునికీకరణ పనులను కూడా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మంచి ఫలితాలు సాధించేలా విద్యార్థులకు సరైన శిక్షణ అందించాలని సూచించారు. తాగునీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

గురుకులంలో కోతుల బెడద ఉందని ప్రిన్సిపాల్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, వాటి నియంత్రణకు తగిన చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. గురుకులం అభివృద్ధి, విద్యా బోధన తదితర అంశాలపై అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, గురుకుల ప్రిన్సిపాల్ సరిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.