ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని త్వరితగతిన ఎఫ్.సి.ఐ కి తరలించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి మిల్లర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేటులోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రబీ సీజన్ కు సంబంధించి వరి ధాన్యం సేకరణకై సంబంధిత అధికారులతో కార్యాచరణ ప్రణాళికపై రైస్ మిల్లర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రబీ సీజన్ సంబంధించి వరి ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. రబీ 2025-26 వరి ధాన్య సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలన్నారు. జిల్లాలోని 129 వరి ధాన్యం సేకరణ కేంద్రాలను సంబంధిత అధికారులు సందర్శించి మౌలిక సదుపాయాల కల్పనకై చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి వరి ధాన్య సేకరణ సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. గతంలో అందజేసిన పాత గోనె సంచులను మిల్లర్లు పౌరసరఫరాల అధికారులకు అప్పజెప్పాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశ్వరి, జిల్లా పౌరసరఫరాల అధికారి సుదర్శన్, జిల్లా మేనేజర్ మోహన్ కృష్ణ, డిప్యూటీ డిఆర్డిఏ నరసింహులు, మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బాలేష్ గుప్త, శ్రీనివాస్ గుప్త, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.