Take a fresh look at your lifestyle.

మా కాలనీని రక్షించండి మహా ప్రభో…శ్రీరాంనగర్ కాలనీ వాసుల ఆవేదన

  • బొటానికల్ గార్డెన్ సమీపంలోనే కాలనీ
  • పలు మార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు
  • కోర్టును ఆశ్రయించడమే శరణ్యమన్న కాలనీవాసులు

మాదాపూర్, ముద్ర: తాము కొనుగోలు చేసిన ప్లాట్ లేదా ఫ్లాట్ ధర పెరిగిందన్న ఆనందం యజమానుల్లో లేకుండా పోయింది. ఇక్కడి నుండి మరో కాలనీకి వెళ్లిపోతే బాగుంటుందేమోననే అభిప్రాయం కొండాపూర్ కాలనీ శ్రీరాంనగర్ కాలనీ వాసులలో ఏర్పడుతోంది. ఇంట్లోంచి అడుగుపెట్టాలంటే అదోరకమైన ఆందోళన. ఇంటి ముందు ఎవరు కారు పార్కు చేశారో ?…మరెవరైనా బైక్ పార్క్ చేశారా?…ఇంట్లోంచి బయటికి వెళితే ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందినవారిని ఎవరిని చూడాల్సివస్తుందో?…అంతకు మించి ఏ జొమోటో, స్విగ్గీ, బ్లింకెట్ లేదా మరే ఇతర సంస్థలకు సంబంధించిన డెలివరీ బాయ్ వాహనం ఆదరబాదగా ఎదురువస్తుందోనన్న భయానక పరిస్థితి. ఇదంతా ఎక్కడో బొంబాయిలోని ధారావి కాలనీ పరిస్థితి అనుకుంటే పొరపడినట్టే. అత్యంత అహ్లాదకరమైన వాతావరం కలిగిన బొటానికల్ గార్డెన్, భాగ్యనగరంలో కొత్తగూడ చౌరస్తాలో పేరెన్నికగన్న శరత్ సిటీ మాల్, కొండాపూర్ ఎనిమిదవ బెటాలియన్, విద్య సంస్థల్లో పేరుపొందిన చిరేక్ పబ్లిక్ స్కూల్ మద్యలో ఇటువంటి పరిస్థితి ఉందంటే ఆశ్చర్యపోనక్కర లేదు.మాదాపూర్ హైటెక్ సిటీ సమీపంలో ఫ్లాట్ లేదా ప్లాట్ కొనడం వల్ల ధరలు పెరిగి, అద్దెలు అదనంగా వస్తున్నాయన్న ఆనందం ఆ కాలనీవాసులలో లేకుండా పోయింది. మురికి కాలువలు, మంచినీటి కుళాయిలు, విద్యుత్ సౌకర్యం లేని రోజుల నుండి ప్రస్తుతం సౌకర్యాలు పెరిగి సమస్యలూ పెరిగాయి. ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటే భయం. ఇంటి ఎదురుగా ఓయో బోర్డులు, లేదంటే కో-లివింగ్ స్పేస్ పేరుతో వివిధ రాష్ట్రాలు, దేశాలకు చెందిన మనుషులు కన్పిస్తుంటారు. తెల్లవారు జామున ఐదు గంటల నుండి మొదలుకొని మరుసటి రోజు ఆర్థరాత్రి దాటాక రెండు మూడు గంటల వరకు సైతం డెలివరీ బాయ్స్ హడావిడే కన్పిస్తుంది. శ్రీరాంనగర్ ఎ-బ్లాక్ లో సుమారు 400 ప్లాట్లు, బి-బ్లాక్ 800, సి-బ్లాక్ లో 300 ప్లాట్లు ఉంటాయని అంచనా. నోటరీ ప్లాట్లే అయినప్పటికీ లే-ఔట్ సమయంలో నిబంధనల పాటించకుండా కేవలం 20 లేదా 25 ఫీట్ల రోడ్లతో ఇరుకైన వీధులు కన్పిస్తాయి. మున్సిపల్ అధికారుల అవినీతిని ఆసరా చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా 100 గజాల స్థలంలో సైతం నాలుగు నుండి ఏడు ఫ్లోర్లతో ఇరుకైన గదులు నిర్మించి అద్దెకు ఇచ్చారు. యజమానుల అత్యాశే వారికి శాపమైంది. జనసాంద్రత పెరగడం, తెలుగు ప్రాంతాలకు సంబంధం లేని వారు అధికంగా నిత్యం కన్పించడంతో సాధారణ జనజీవనం గడిపే వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

  • అనుమతి లేని భవనంలో జెప్టో:

శ్రీరాంనగర్ బి-బ్లాక్ లో 400 గజాల స్థలంలో సెల్లార్ తో ఏడంతస్థులు అక్రమంగా నిర్మించిన భవనంలో జప్టో కార్యాలయం నడుపు కాలనీవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు భవన యజమాని, జప్టో నిర్వాహాకులు. మున్సిపల్ నిబంధనల ప్రకారం భవనం చుట్టు నిర్ణీత స్థలం వదిపెట్టాల్సి ఉండగా ఆ నిబంధలేవీ పాటించకుండా పూర్తి స్థలంలో నిర్మాణం చేసి, పైగా ముందు వెనుక భాగాల్లో రోడ్డు పైకీ వచ్చేట్లు ఐరెన్ గ్రిల్స్ ఏర్పాటు చేసి రోడ్డును భవన యజమానులు ఆక్రమించారు. రాత్రింబవల్లు వందల సంఖ్యలో వచ్చిపోయే జప్టో బాయ్స్ వల్ల కాలనీ వాసులు తీవ్ర అసౌకర్యానికి గురౌతున్నా అధికారులు స్పందించడంలేదు. ఇటీవలే కాలనీ వాసులకు, జప్టో సిబ్బంది తీవ్ర వాగ్వాదం జరిగి గొడవకు దారితీసింది.

  • మున్సిపల్ అధికారులకు పలు మార్లు ఫిర్యాదు:

శ్రీరాంనగర్ ఏ, బీ, సీ కాలనీల్లో కొన్ని ప్లాట్ల యజమానుల అత్యాశ వల్ల సాధారణ జీవనం గడిపే వారికి రోజు వారీ ఇబ్బందులు ఎదురౌతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ శేరిలింగంపల్లి జోనల్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాలనీల్లో అనధికారికంగా నిర్వహిస్తోన్న ఓయో, కో-లివింగ్, ఇతర కమర్షియల్ వ్యాపారాలను కట్టడి చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక కార్పోరేటర్, మున్సిపల్ అధికారులు డీసీ, జెడ్సీలకు వ్రాతపూర్యక ఫిర్యాదులు ఇచ్చారు.ఎంతకూ స్పందించకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీకీ సైతం కలిసి తమ గోడును విన్పించారు.ఎమ్మెల్యే ఫోన్ చేసినా అధికారులు స్పందించలేదు.శ్రీరాంనగర్ కాలనీలో జనజీవన స్రవంతికి ఇబ్బంది కలిగిస్తున్న ట్రాఫిక్ సమస్యతో పాటు, అపరిచిత వ్యక్తులు, సమయ పాలన లేని డెలివరి బోయ్స్ అడావిడిని అరికట్టే విధంగా మీరైనా అధికారులను ఆదేశించాలంటూ స్థానిక కాలనీ వాసులు ఎమ్మెల్యే అరికపూడి గాంధీని కలిసి మొరపెట్టుకోగా తను తక్షణమే స్పందించి మున్సిపల్ అధికారులను ఆదేశించి నెల రోజులు గడిచినా ఫలితం లేకుండా పోయిందని కాలనీ వాసులు శివకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

  • ట్రేడ్ లైసెన్స్ లేకుండానే…

నివాస ప్రాంతాల్లో అసలు కమర్షియల్ కార్యక్రమాలకు అనుమతి ఉండదు. ఒక వేల తప్పని సరి వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించాలంటే ట్రేడ్ లైసెన్స్ పేరుతో ప్రత్యేక లైసెన్స్ కలిగి ఉండాలి.ఓయో, కో-లివింగ్ లాంటి వ్యాపారాలు నడపాలంటే ఫైర్, పోలీసు, మున్సిపల్ తదితర శాఖల అనుమతులు తప్పని సరి. కొంత మంది దళారులు ప్లాట్ల యజమానులతో ముందే అధిక మొత్తానికి ఒప్పందాలు కుదర్చుకుని రెసిడెన్సియల్ ఏరియాలో కమర్షియల్ నివాసాలు ఏర్పాటు చేసి లక్షల రూపాయలు చేతులూ మారుస్తూ సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. గత నెల రోజులుగా మూడు కాలనీల్లో అసౌకర్యాల పట్ల కాలనీ అసోషియేన్స్, ప్రయివేటు వ్యాపారుల మద్య జరుగుతున్న ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయోనన్న ఆవేదనను కాలనీ వాసులు వ్యక్తం చేస్తున్నారు.

  • స్పందించని పోలీసులు:

నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురౌతున్నా..అసలు విషయాన్ని పోలీసులు గుర్తించలేకపోతున్నారు. మాదాపూర్ నుండి బొటానికల్ గార్డెన్ మీదుగా శ్రీరాంనగర్ వయా మసీద్ బండ నుండి శేరిలింగంపలి ఓల్డ్ ముంబై రోడ్డు కు వెళ్లే వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురౌతున్నాయి. అడపాదడపా ట్రాఫిక్ పోలీసులు ఒకరిద్దరు ట్రాఫిక్ ను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తారే తప్ప సమస్యకు మూలాలను గుర్తించడం లేదు.

  • కోర్టే శరణ్యం:

శ్రీరాంనగర్ ఏ,బీ,సీ కాలనీల్లో కమర్షియల్ కార్యక్రమాల విషయాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పరిష్కారం చూపడంలో నిర్లక్ష్యం వహిస్తే కోర్టును ఆశ్రహించాల్సి వస్తుందని కాలనీ వాసులు తెలిపారు. కొందరు దళారులవల్ల సాధారణ జీవనం గడిపే కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, తాము తమ ఇళ్లలో ప్రశాంత జీవనం గడపాలంటే ఒక కోర్టును ఆశ్రయించడమే పరిష్కార మార్గం అని భావిస్తున్నట్లు కాలనీ అసోషియేషన్ ప్రతినిధులు జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.