Take a fresh look at your lifestyle.

ఫీజుల దోపిడికి చెక్…!

  • ప్రైవేటు లక్షల్లో వసూలు చేస్తున్న ఫీజులపై నియంత్రణ.
  • బలహీనవర్గాలకు  25 శాతం సీట్ల కేటాయింపు.
  • నేడు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం కీలక సమావేశం.
ముద్ర, తెలంగాణ బ్యూరో: ప్రైవేటు పాఠశాలల్లో వసూలు  చేస్తున్న ఫీజులకు ముకుతాడు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమతోంది. ఫీజుల నియంత్రణపై మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.ఇందులో భాగంగా సోమవారం సచివాలయంలో కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ,  విద్య హక్కు చట్టం (ఆర్ టిఇ ) కింద పేద విద్యార్ధులకు  25 శాతం సీట్ల కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించనుంది.మంత్రివర్గ ఉప సంఘం ఛైర్మన్ శ్రీధర్ బాబు నేతృత్వంలో ఫీజుల నియంత్రణపై కూలంకషంగా చర్చించనుంది.
వాస్తవానికి  ఫీజుల నియంత్రణపై రాష్ట్ర విద్యా కమిషన్ సమగ్ర అధ్యయనం చేసి, ‘తెలంగాణ ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు-2025’ పేరుతో జనవరి 24న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.గతంలో ఫీజుల నియంత్రణకు జీవో జారీ చేసినప్పటికీ, న్యాయపరమైన చిక్కుల కారణంగా అది నిలిచిపోయింది. అందువల్ల, ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం చేయాలని కమిషన్ అభిప్రాయపడింది.కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఫీజుల నియంత్రణపై లోతుగా చర్చించనున్నారు.మరోవైపు, విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 12 1(సీ)ని వచ్చే విద్యా సంవత్సరం నుండి తప్పనిసరిగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఈ నిబంధన అమల్లోకి వస్తే, ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాల్సి ఉంటుంది. వారి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది.అయితే ఇది జరిగితే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉంది. కర్ణాటక తరహా విధానాన్ని అమలు చేస్తే, ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేని ప్రాంతాల్లో మాత్రమే ప్రైవేట్ పాఠశాలల్లో సీట్లు కేటాయిస్తారు. దీని కోసం గతంలో జారీ చేసిన జీవోలో సవరణలు చేయాల్సి ఉంటుందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు.మరి కొందరైతే పార్లమెంటులో చట్ట సవరణ చేయాలని అభిప్రాయపడుతున్నారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టుతో ముడిపడి ఉన్నందున, ఈ సమావేశంలో ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే, ఫీజుల నియంత్రణపై మాత్రం ప్రభుత్వం మరికొంత సమయం తీసుకుంటుందా? లేదా తక్షణమే ఒక నిర్ణయం ప్రకటిస్తుందా? అనేది వేచి చూడాలి.కాగా ఈ సమావేశంలో  తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర విద్యా వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపనుందని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.