సౌదీ రోడ్డు ప్రమాదంలో గాయపడిన మంద మహేష్‌కు అండగా ఉంటా.
సొంత ఖర్చులతో ఇండియాకు రప్పిస్తా.
మెరుగైన వైద్యం చేపించి ఆదుకుంటానని కేటీఆర్ హామీ .
ముద్ర, తెలంగాణ బ్యూరో : పొట్ట చేత పట్టుకొని జీవనోపాధి కోసం గల్ఫ్ వెళ్లిన సిరిసిల్లా నియోజకవర్గం, మండేపల్లి గ్రామానికి చెందిన మహేష్, కంపెనీ బస్సులో పనికి వెళ్తుండగా తీవ్రమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు.మహేష్ మాత్రం బతికినప్పటికీ, ఆయన తీవ్ర గాయాలతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రస్తుతం జుబెయిల్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.డబ్బులు లేక సరైన వైద్యం అందక, మహేష్ పరిస్థితి విషమంగా మారుతుండగా ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మండేపల్లిలోని మహేష్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చారు. మహేష్‌కు అండగా ఉంటానని, బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.సౌదీలో చికిత్స పొందుతున్న మహేష్‌తో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన కేటీఆర్, “అధైర్యపడొద్దు. నాలుగు ఐదు రోజుల్లోనే సొంత ఖర్చులతో నిన్ను స్వస్థలానికి తీసుకువస్తాను,” అని భరోసా ఇచ్చారు.వెంటనే సౌదీలో ఉన్న పార్టీ ప్రతినిధులు, తెలిసిన వారిని జుబెయిల్ ఆసుపత్రికి పంపించి మహేష్‌కు అండగా ఉండేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు.అంత తీవ్ర ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మహేష్ ధైర్యంగా ఉండాలని, “నీ కుటుంబం కోసం బలంగా ఉండాలి” అని కేటీఆర్ సూచించారు. మహేష్ చికిత్సకు అవసరమైన వైద్య ఖర్చులు, విమాన ప్రయాణ ఖర్చులు తానే భరిస్తానని, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటానని తెలియ చేశారు.సౌదీలో ఉన్న పార్టీ ప్రతినిధులు, పరిచయాలు ఉన్న వారిని వెంటనే మహేష్ వద్దకు పంపించిన కేటీఆర్, ఆయనకు అండగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. మంద మహేష్ స్వస్థలానికి వచ్చే ప్రక్రియలో అవసరమైన అధికారిక కార్యక్రమాల సమన్వయం కోసం తెలంగాణ ఎన్ఆర్ఐ శాఖ, విదేశాంగ శాఖ అధికారులకు లేఖ రాశారు.