ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
విద్యార్థులు చదువుతోపాటు సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ భాగస్వాములు అయ్యేందుకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు.

శనివారం గద్వాల ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు బిఎస్ జీ, ఎన్ సీ సీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో వారిలో క్రమశిక్షణ, దేశభక్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందడానికి అవకాశం ఉందన్నారు.

అలాగే సామాజిక సమస్యలపై అవగాహన కలగడమే కాక వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందన్నారు. బి ఎస్ జి విద్యార్థులకు వారి శిక్షణ అనంతరం ఇచ్చే సర్టిఫికెట్ భవిష్యత్తులో వారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడానికి ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యంగా పోలీసు శాఖలో రాణించేందుకు ఈ శిక్షణ దోహదపడుతుందన్నారు. ఈ శిక్షణ పొందేందుకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎక్కువగా అవకాశం ఉంటుందని, జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండడంతో విద్యార్థులు బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు వివిధ కళలపై, ఇతర అంశాలపై నైపుణ్యాలు పెరిగేందుకు శిక్షణ తీసుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ కు విద్యార్థులు ఘనంగా స్వాగతం పలుకుతూ స్కార్పును, బాడ్జిని అందజేశారు. అలాగే జ్యోతి ప్రజ్వలన చేసి, భారతమాత చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం స్కౌట్స్ విద్యార్థులు పరేడ్ నిర్వహించగా అతిధులు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన వివిధ స్కిట్ ప్రదర్శనలు, స్వాగత నృత్యం ఆకట్టుకుంది. చివరగా అతిధులు విద్యార్థులతో కలిసి గ్రూప్ ఫోటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో డిఇఓ విజయలక్ష్మి, బి ఎస్ జి రాష్ట్ర కోశాధికారి రాజగోపాల్, రాష్ట్ర శిక్షకులు అమర జ్యోతి, రవి కిరణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేణుకాదేవి, స్కౌట్ మాస్టర్లు కృష్ణ కుమార్, ప్రశాంత్ కుమార్, గైడ్ కెప్టెన్లు డా. యాసిం బీ, కవిత, పలువురు విశ్రాంత అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.