ముద్ర, తెలంగాణ బ్యూరో : ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ ప్రభుత్వం బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.ఉద్యోగుల సమస్యలుపై సానుకూలంగా స్పందించి వాటిని పరిష్కరించాలన్న లక్ష్యంతోనే సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సబ్ కమిటీని, అధికారుల కమిటీని నియమించారన్నారు. బుధవారం సచివాలయంలో సబ్ కమిటీ సభ్యులు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు తదితరులతో కలిసి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఉద్యోగుల సమస్యలపై అందరితో చర్చించి సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి సానుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల కమిటీకి సూచించారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమస్యలను ఎక్కువ కాలం పెండింగ్ లో పెట్టకుండా వాటికి యుద్ద ప్రాతిపదికన పరిష్కారం చూపాలనదే ప్రభుత్వ ఆలోచన అని ఉద్యోగ సంఘాలకు వివరించారు. గురువారం జరిగనున్న క్యాబినెట్ సమావేశం లో అధికారుల నివేదికతో పాటు నేరుగా ఉద్యోగ సంఘాలతో చర్చించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు గా ప్రజా ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. ప్రజలకు చేయాల్సిన పనులు, అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలు,ప్రభుత్వ ఆదాయం, వ్యయం వీటన్నిటితో పాటు ఉద్యోగ వ్యవస్థకు ఇవ్వాల్సినవి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తుందన్నారు.ఒకవైపు ప్రజలకు మరోవైపు ఉద్యోగులకు ఇబ్బందులు కలగకుండా కలిసి కూర్చుని చర్చించుకుని ముందుకు పోవాలన్న ఆలోచనతోనే క్యాబినెట్ సమావేశానికి ముందు ఉద్యోగ సంఘాలతో సమావేశమైనట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.గత పది సంవత్సరాల పాలనతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయన్నారు.అయినప్పటికీ ఉద్యోగులకు సాధ్యమైనంత మేరకు మేలు చేయాలి, వారి సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచనలో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి తారీకు నే జీతాలు చెల్లిస్తోందన్నారు.గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలు పెద్ద సంఖ్యలో తీసుకువచ్చామన్నారు.వనరులు సమకూర్చుకొని ప్రజలపై అదనంగా ఒక్క రూపాయి భారం పడకుండా ముందుకు పోతున్నామన్నారు. అదే నేపథ్యంలో ఉద్యోగుల సంక్షేమం కోసం ఆర్థికపరమైన కసరత్తు చేస్తున్నామని భట్టి అన్నారు.ఈ కసరత్తు విజయవంతం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుందని వివరించారు.ఉద్యోగులకు మంచి చేయాలన్న ఆలోచనతోనే పలుమార్లు సమావేశాలు నిర్వహించామని వివరించారు.ప్రభుత్వ ఆదాయానికి,ఖర్చుకు చేయాల్సిన పనులను బేరీజు వేసుకొని ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని భట్టి ఉద్యోగ సంఘాలకు భరోసా ఇచ్చారు.ఉద్యోగుల కుటుంబాల్లో పెళ్లిళ్లు, ఆసుపత్రుల ఖర్చులకు సంబంధించిన సమస్యలపై క్యాబినెట్ సహచరులమంతా అంతర్గతంగా పలుమార్లు చర్చించుకున్నామనారు.ఇందులో ఎవరికీ ఎలాంటి భిన్నాభిప్రాయం లేదని తెలిపారు.