ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్:
ప్రపంచ టిబి నియంత్రణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఘన కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా టిబి నియంత్రణలో రాష్ట్రంలో మొదటి స్థానాన్ని సాధించి విశిష్ట గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా గాంధీ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ IAS, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డా. రవీంద్ర నాయక్ హాజరయ్యారు. టిబి నిర్మూలనలో విశేష కృషి చేసినందుకు జిల్లా వైద్యాధికారి డా. రవి కుమార్ నాయక్‌కు ప్రత్యేక అవార్డు ప్రదానం చేయగా, ప్రోగ్రామ్ అధికారి రఫీక్‌ను కూడా సత్కరించారు.
టిబి నియంత్రణలో జిల్లాకు రాష్ట్రంలో మొదటి స్థానం లభించడం పట్ల అధికారుల్లో ఆనందం వ్యక్తమైంది. గ్రామ స్థాయి వరకు వైద్య సేవలను విస్తరించడం, టిబి రోగులను త్వరగా గుర్తించి సమయానికి చికిత్స అందించడం ఈ విజయానికి ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు.
పూర్తి స్థాయి చికిత్స అందించడంలో జిల్లా ముందంజలో నిలవడం, వైద్య సిబ్బంది అంకితభావానికి ఇది నిదర్శనమని తెలిపారు.
“టిబి రహిత సమాజం దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు” అని జిల్లా వైద్యాధికారి డా. రవి కుమార్ నాయక్ పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంపు ద్వారా మరింత విజయాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.