ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
సలేశ్వరం జాతర సందర్భంగా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను జోగులాంబ జోన్ డీఐజీ ఎల్ ఎస్ చౌహన్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌తో కలిసి జాతర ప్రాంగణాన్ని సందర్శించి, పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు.
జాతరలో చేపట్టిన భద్రతా చర్యలపై డీఐజీ సంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది అంకితభావంతో పని చేస్తున్నారని ప్రశంసించారు. ముఖ్యంగా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో సుమారు 400 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు. అలాగే అనవసరంగా లోతైన అటవీ ప్రాంతాల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు.
ఈ సందర్భంగా సమర్థవంతమైన బందోబస్తు ఏర్పాట్లు చేసిన జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
ఇక గురువారం రాత్రి జరిగిన ఘటనలో నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ బాబుమియా ప్రమాదవశాత్తు లోయలో పడిపోవడంతో, అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై మురళి, కానిస్టేబుల్స్ ఊర్మిళ, మణికలు వెంటనే స్పందించి అతన్ని క్షేమంగా పైకి తీసుకువచ్చారు. అనంతరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ధైర్యసాహసాలకు గాను డీఐజీ సంబంధిత పోలీసు సిబ్బందిని అభినందించారు.
సలేశ్వరం జాతరలో భక్తుల భద్రతకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.