ముద్ర ప్రతినిధి, సిద్దిపేట:
ఈనెల 18 శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కార్మిక కర్షక భవన్లో జరగనున్న తెలంగాణ రైతు సంఘం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో పిలుపునిచ్చారు. గురువారం జిల్లా మహాసభ కు సంబంధించిన కరపత్రాన్ని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ , రాష్ట్ర కమిటీ సభ్యులు ఆముదాల మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మూడ్ శోభన్ మాట్లాడుతూ వ్యవసాయ రంగం అనేక ఇబ్బందుల్లో ఉందని రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను ప్రభుత్వాలు కల్పించకపోవడం షోచనీయమన్నారు.
వ్యవసాయ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో సరిపోను నిధులు కేటాయించకపోవడం, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల పై, వ్యవసాయ పనిముట్లపై సబ్సిడీలను ఎత్తివేయడం జరిగిందన్నారు. యూరియా కొరత, కల్తీ విత్తనాలు కల్తీ పురుగు మందులను ప్రభుత్వాలు నియంత్రించక పోవడం, పత్తి మొక్కజొన్న పొద్దుతిరుగుడు కొనుగోళ్లలో అనేక ఆంక్షలు విధించడం దారుణం అని వ్యవసాయాన్ని కార్పొరేటీక రించేందుకు ప్రభుత్వాలు చాప కింద నీరులా క్రమక్రమంగా వ్యవసాయ రంగాన్ని నష్టాల ఊబిలోకి నెట్టే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూన్నామన్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతాంగానికి మద్దతుగా జరిగే సిద్దిపేట జిల్లా 3 వ మహాసభను జయప్రదం చేయాలని రైతు సోదరులు ఈ మహాసభకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చల్లారపు తిరుపతిరెడ్డి, బద్దిపడిగ కృష్ణారెడ్డి, ఆముదాల నర్సిరెడ్డి, తుప్పర్తి రాజు,కనుక చారి, కృష్ణారెడ్డి, బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.